పాలకు ధరను వెన్న శాతాన్ని బట్టే నిర్ణయిస్తారు. మేతలు ఎంత బాగా పెడుతున్నా వెన్న శాతం తక్కువగా ఉంటుందని చాలాసార్లు రైతులు వాపోతుంటారు. పాల శాతం అధికంగా ఉంటే వెన్న శాతం సాధారణంగానే కొంచెం తక్కువగా వుంటుంది. వేసవి కాలంలో పశుగ్రాసాల లభ్యత తక్కువగా వుంటుంది, ఎండవేడిమి, అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి రైతాంగం పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉండేందుకు దోహదపడే అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటే వారు ఉత్పత్తి చేసే పాలకు ఎక్కువ ధర లభించే అవకాశం వుంటుంది. తద్వారా పాడిపరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది.
- పాలల్లో వెన్న శాతం ప్రభావితం చేసే అంశాలు
పాలల్లో వెన్న శాతాన్ని ఆ పశువు జన్యుపరంగా సామర్థ్యం, జాతి, ఈతల సంఖ్య, పాల దిగుబడి, మేత, పాలిచ్చే కాలం, వాతావరణం, గృహ వసతి మొదలగునవి ప్రభావితం చేస్తాయి. ఆవుల్లో కంటే గేదెల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. సంకరజాతి, విదేశీజాతి పశువుల్లో పాలదిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ, గీర్, సాహివాల్ వంటి దేశీయ ఆవుల్లో, ముర్రా గేదెల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. ఆ పశువుల వయస్సు పెరిగిన కొద్దీ వెన్నశాతం తగ్గుతుంది. పశువులు ఈనిన 3-5 రోజుల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 2 మాసాల వరకు పాలదిగుబడి పెరుగుతుంది. వెన్నశాతం తగ్గుతుంది. ఈత చివర్లో 8 మాసాలప్పుడు, వట్టిబోయే దశలో పాలదిగుబడి తగ్గుతుంది. వెన్నశాతం పెరగడం గమనిస్తాం. సాధారణంగా పాడికాలం పెరిగేకొద్ది, వారానికి 2.5% చొప్పున పాలఉత్పత్తి తగ్గుతుంది. వెన్నశాతం పెరుగుతుంది. వాతావరణం ఉష్ణోగ్రత 10డిగ్రీల ఫారెన్హీట్, ఎక్కువైతే వెన్నశాతం 0.1-0.2% చొప్పున తగ్గుతుంది, అందువల్ల వేసవిలో కంటే చలికాలంలో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వేసవిలో ఉదయం, చలికాలంలో సాయంత్రం వేళల్లో పితికిన పాలల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది.
Also Read దగ్గు, ఆయాసం, కడుపుబ్బరం, మంటకు అతిమధురం’ వైద్యం
పశువులు ఎదలో ఉన్నప్పుడు పాల ఉత్పత్తి, వెన్నశాతం తగ్గుతుంది. పశువులు వ్యాధులకు లోనైనపుడు, లేగదూడలు మరణించినపుడు వెన్న శాతం తగ్గుతుంది. 2-3 కి.మీ. దూరం తిరిగి మేసివచ్చిన పశువుల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. చాలాదూరం తిరిగి తీవ్రమైన కదలికకు గురైతే మాత్రం వెన్నశాతం తగ్గుతుంది. పశువు ఆరోగ్యం సరిగా లేకుంటే కూడా వెన్నశాతం తగ్గుతుంది. పాలుపితికే సమయంపై కూడా వెన్నశాతం ఆధారపడి ఉంటుంది. నెమ్మదిగా పాలు పితికితే పాలదిగుబడి, వెన్నశాతం తగ్గుతుంది.. ఆ పాలు పితికే వ్యక్తి మారినపుడు కూడా వెన్న శాతం తగ్గే అవకాశాలుంటాయి, ముందు పితికిన పాలల్లో కంటే, చివరగా పితికిన పాలల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది.
పాలల్లో వెన్నశాతం పెంచడం ఎలా?
పశువుల మేపు, పాలు పితికే ప్రక్రియ, మేలైన యాజమాన్య పద్ధతులు, ఆచరణ మొదలగు విషయాల్లో గోరంత మార్పు చేస్తే, అధిక వెన్న శాతం పొంది, కొండంత ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.
మేపు విషయంలో…..
- లేత దశలోని గడ్డిలో పీచుపదార్థం తక్కువగా ఉన్నందున, పాలదిగుబడి తగ్గుతుంది. కాబట్టి పశువులకు అందించే మేపులో 1/3 వంతు ఎండుగడ్డి కూడా ఉండాలి.
- పశుగ్రాసాన్ని అంగుళంలో 1/4 కంటే చిన్నగా ముక్కలు చేసి మేపడం
వల్ల వెన్నశాతం తగ్గుతుంది. కాబట్టి గ్రాసాన్ని అంగుళంలోపు మరి
చిన్నగా నరికి మేపకూడదు. 3. పాడి పశువులకందించే పచ్చిమేతలో 30-50% పప్పుజాతి పశుగ్రాసాలు ఉండే విధంగా చూడాలి. పశుగ్రాసాల్ని పూతదశలో కోసిమేపాలి. - వరిగడ్డి, చొప్పను ప్రతిరోజు 9-10 గంటలపాటు పశువుల ముందుంచాలి. పశువులు ఎంత ఎక్కువసేపు గడ్డి నమిలి, నెమరు వేస్తే అంత లాలాజలం స్రవించి, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
- ఎండుగడ్డి ఎక్కువగా అందించాల్సిన పరిస్థితుల్లో బైపాస్ ప్రోటీన్ అధికంగా లభ్యమయ్యే ప్రతిచెక్కను రాత్రి నానబెట్టి, ఉదయం అందించాలి. నూనె తీసిన నువ్వులు, కొబ్బరి, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు చెక్కలవల్ల కూడా వెన్నశాతం పెరుగుతుంది. వరి అన్నం, సోయాచెక్క, క్యాబేజి, మొక్కజొన్న మొదలగునవి వెన్నశాతం తగ్గిస్తాయి.
- పెల్లెట్ రూపంలో దాణాను అందిస్తే వెన్నశాతం తగ్గుతుంది. కాబట్టి తగు పరిమాణంలో తవుడు ఉండేలా చూడాలి.
- దాణాల్లో మొలాసిస్ ఎక్కువ కలిపితే వెన్నశాతం తగ్గుతుంది. కాబట్టి దాణాలో 10-15% కంటే మించి మొలాసిస్ కలుపకూడదు.
- పాడిపశువులకందించే దాణాను 2 సార్లు కాకుండా 4-5 సార్లు కొద్ది కొద్దిగా ఇవ్వడం మంచిది. దాణాను నీళ్ళలో కలిపి కాకుండా, తడిపి ఇవ్వాలి.
- పశుగ్రాసం, ఎండుమేతను దాణాకంటే 1-2 గంటల ముందే అందివ్వాలి. దాణా తర్వాత గడ్డి, గ్రాసం అందిస్తే వెన్నశాతం తగ్గుతుంది.
- పశువులకు మేపు సరిపోను మోతాదులో శాస్త్రీయపరంగా అందించాలి. మేపులో లోపం సంభవిస్తే పాలల్లోని మాంసకృత్తులు మరియు ఎస్.ఎన్.ఎఫ్ శాతం, పాలదిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది.
యాజమాన్య పద్ధతులు ఆచరణ విషయంలో…
- పశువులు అధిక ఉష్ణోగ్రతకు లోనుకాకుండా శీతలస్థితిని కల్పించాలి.
- పశువుల పాకలు ఎత్తైన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారళంగా వీచేలా నిర్మించాలి.
- పశువుల్ని నీళ్ళకుంటల్లో ఈదనివ్వాలి.
పాలు పితికే పద్ధతి విషయంలో…
- పాలను సంపూర్ణంగా పితకాలి.
- వీలైనంత వరకు 5-7 నిమిషాల్లో పాలు పిండాలి అంతకంటే ఆలస్యం చేయకూడదు.
- పాలు పితికేప్పుడు పశువుల్ని ఆవేశపరచడం, కొట్టడం చేయకూడదు.
- దూడ మరణించినా, పాలు పితికే వ్యక్తి మారినా వెన్నశాతం తగ్గుతుంది.
- ముందు పితికిన పాలల్లో కంటే చివర పితికిన పాలల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చివరి ధారలను కూడా పితకాలి.
ఇతర సప్లిమెంటుల వాడకం విషయంలో…
- పాడి పశువులకు విటమిన్ ‘ఎ’ మరియు కాపర్, కోబాల్ట్, అయోడిన్ వంటి ఖనిజ లవణాలు సరైన పాళ్ళలో అందివ్వాలి.
- దాణాలో వంటసోడా రోజుకు 120 గ్రా. లతో ప్రారంభించి 240 గ్రా. లవరకు కలిపి ఇవ్వడం వల్ల వెన్నశాతం పెరుగుతుంది.
- ప్రతిరోజు 25-50గ్రాముల కోలిన్ అందించడం వల్ల, బైపాస్ ఫ్యాట్ వాడటం వల్ల కూడా వెన్న శాతం పెరుగుతుంది.
- “గోధారశక్తి” లాంటి బైపాస్ ఫ్యాట్, ప్రొబయాటిక్స్, గేలక్టోగోగ్స్ మొదలగు వాటితో కూడిన మందుల్ని వాడడం వల్ల కూడా పాలల్లో వెన్న శాతం వృద్ధి చెందుతుంది.
డా. జి. శ్రీమంజులా రెడ్డి, డా. కె. రాజకిషోర్, పశుపోషణ విభాగం, పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV