బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన రెడ్డికి నారా చంద్రబాబునాయుడు క్యాబినేట్ లో కీలకమైన ఆర్ అండ్ బీ శాఖ మంత్రిత్వ శాఖ పదవి అలంకరిచడంతో బనగానపల్లె ప్రాంతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితిపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో నూతనంగా ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ప్రతి ఒక్కరు గుంతలమయమై అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల దుస్థితి బాగుపడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 12న రాష్ట నూతన సీఎం చంద్రబాబు నేతృత్వంలో పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు కావడం, ఆయన క్యాబినెట్ లో మంత్రిపదవి దక్కించుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి కీలకమైన ఆర్ అండ్ బి మంత్రిత్వ శాఖ దక్కటంతో అందరి చూపు ఆ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పై పడింది.అయితే రాష్ట వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి బాగోగులు పక్కన పెడితే బనగానపల్లె ప్రాంత రోడ్లకు మహర్దశ పట్టనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా బనగానపల్లెలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టిన రింగ్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకుని పూర్తయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. అదే విధంగా పసుపల నుంచి బనగానపల్లె మీదుగా గోస్పాడు వరకు ఉన్న ఆర్ అండ్ బి రహదారి వెడల్పు, బనగానపల్లె నుంచి కొలిమిగుండ్ల వరకు ఉన్న ఆర్ అండ్ బి రహదారి, బనగానపల్లె నుంచి పాణ్యం రహదారి, కోవెలకుంట్ల నుంచి నోస్సం ఆర్ అండ్ బి రోడ్డు, బనగానపల్లె, కోవెలకుంట్లలో పాడుపడిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మళ్ళీ పునర్నిర్మాణం వంటి పనులు చురుకుగా జరుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు.