దుర్గామాతను పూజించిన శ్రీ రాముడు.

Lord-Rama-worshiped-Goddess-Durga-www.politicalhunter.jpg

దుర్గామాతను పూజించిన శ్రీ రాముడు.

ఈ కథ కలకత్తా వైపు మనకు ప్రాచుర్యంలో వుంది. దీన్ని అకాల బోధన్ అంటారు. అకాల అంటే కాలం గాని కాలంలో. బోధన్ అంటే పూజించడం/ ఆవాహన చేయటం. సాధారణంగా అమ్మవారిని వసంత ఋతువులో పూజిస్తారు. అయితే రాముడు కాలం కాని కాలంలో పూజించినందు వలన ఈ పేరు వచ్చిందట.

రావణుని మీద యుద్ధం ప్రకటించే ముందు శ్రీ రాముడు దుర్గామాత అనుగ్రహం పొందాలనుకున్నాడు. అమ్మవారిని 108 నీలి పద్మాలతో పూజిస్తే ప్రసన్నమవుతుందని తెలుసుకుని పద్మాలు సేకరించాడు. పూజ ముగిసే సమయానికి అందులో ఒక పుష్పం తగ్గిందని తెలుసుకుని, తన నేత్రాలు నీలిపద్మాల వలె ఉంటాయని అందరూ అంటారు కనుక తన కళ్ళనే అర్పిద్దామని బాణాన్ని కంటి దగ్గర పెట్టగానే దుర్గమ్మ ప్రత్యక్షమైంది. రావణుడు మట్టి కరుస్తాడని చెప్పి, అభయమిచ్చింది. ఆ తర్వాత రావణ వధ జరగడం, సీతమ్మతో కలిసి అయోధ్య చేరడం మనకు తెలిసినదే. అలా శ్రీ రామచంద్రుడు దుర్గామాతను ఆరాధించాడు.

శ్రీ రాముని చేత పూజలందుకున్న వినాయకుడు తమిళనాడులోని ఉప్పూర్‌లో, రామ ప్రతిష్టితమైన నవగ్రహాలు రామేశ్వరం దగ్గరలో నవపాషాణంలో ఉన్నారు. ముందుగా విఘ్ననివారణ కోసం శ్రీ మహగణపతిని పూజించి, ఆ తర్వాత కార్యసిద్ధి కోసం నవగ్రహాలను కూడా పూజించాడు. అలాగే రావణ వధానంతరం రామేశ్వరంలో సీతమ్మ ఇసుకతో లింగం చేయగా రాముడు పూజించాడు. అది ఇప్పటికీ రామేశ్వరంలో ఉంది.

అందుకే మనమంతా ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతిని పూజించి, నవగ్రహాలను స్మరించి, మిగితా దేవతలను ఆరాధించి అప్పుడు ప్రారంభిస్తాము.

శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తే లోకులు అది పాటిస్తారు. మనందరికి సరైన మార్గం చెప్పుటకు శ్రీరాముడు ఈ విధంగా అర్చించాడు. మనం కూడా భగవదారాధనలో శ్రీ రాముని మార్గంలో నడవాలి. అహంభావనను విడిచి సర్వదేవతలను సమభావంతో ఆరాధించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top