ప్రమాదంలో ఇండిగో విమానం..దారివ్వని పాకిస్థాన్!

IndiGo flight in accident...Pakistan did not give way!

IndiGo flight in accident...Pakistan did not give way!

  • ప్రమాదంలో ఉన్నామని చెప్పినా ఇండిగో విమానానికి దారివ్వని పాకిస్థాన్!
  • ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం
  • వడగళ్ల వాన నుంచి తప్పించుకునేందుకు పాక్ గగనతలం కోరిన పైలట్
  • అనుమతి నిరాకరించిన లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్
  • ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం
  • బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది.

ప్రతికూల వాతావరణం కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో పాకిస్థాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ2142 విమానం 227 మంది ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో, అమృత్‌సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫానులో చిక్కుకుంది. దీంతో విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు.

వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో విమాన పైలట్ తక్షణమే స్పందించాడు. సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ను సంప్రదించి, తుఫాను నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్థాన్ గగనతలంలోకి అనుమతించాలని అభ్యర్థించారు. అయితే, పాకిస్థాన్ ఏటీసీ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దీంతో పైలట్, ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించి, తీవ్రమైన కుదుపులను తట్టుకుంటూ విమానాన్ని నడిపారు.

సాయంత్రం 6:30 గంటల సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర పరిస్థితిని వివరించిన అనంతరం పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానం ముందు భాగంలోని ముక్కు (నోస్) దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వర్గాలు తెలిపాయి. అయితే, విమానానికి మరమ్మతులు అవసరమవడంతో దానిని ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్’ (ఏవోజీ)గా ప్రకటించి, తాత్కాలికంగా సేవలకు దూరంగా ఉంచారు.

గతంలో పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పాకిస్థాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసిన విషయం తెలిసిందే. అలాగే, భారత గగనతలంలోకి పాకిస్థానీ విమానాలకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు..

#IndiGo flight in accident…Pakistan did not give way!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top