రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి మరియు సేంద్రియ పదార్థం నశించి భూమి నిస్సారమైపోతుంది. 68 దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు జీవామృతం చక్కగా ఉపయోగపడుతుంది. జీవామృతం ఒక సేంద్రియ ఎరువు, అధిక బయోమాస్, సహజ కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు క్యాల్షియం వంటి అవసరమైన పోషకాలు కలిగి మొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి దోహదపడుతుంది.
మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు నేల సారాన్ని మరియు పంటల ఉత్పాదకతను పెంచుతాయి. నేలలో ఉన్న సూక్ష్మజీవులను పెంచేందుకు. జీవామృతం ఉపయోగపడుతుంది. జీవామృతం చల్లిన భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు చైతన్యవంతమై పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి. స్థానిక గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతోనే జీవామృతం తయారు చేయవచ్చు.
జీవామృతం రెండు రకాలు ఒకటి ఘనజీవామృతం మరొకటి ద్రవ జీవామృతం. ఆవు పేడ, మూత్రం, పుట్టమట్టి, పప్పుల పిండి, బెల్లంతో ద్రవ జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి తయారు చేసుకుని వాడుకోవాలి. ఘనజీవామృతాన్ని అనుకూలమైన ఎండాకాలంలో తయారు చేసుకోవాలి. ఘనజీవామృతాన్ని ఏటా ఎకరానికి 400 కిలోలు వేస్తే చాలు.
ద్రవ జీవామృతం
ఒక ఎకరం పంట పొలానికి సరిపడా ద్రవజీవామృతం తయారీకి కావలసిన పదార్థాలు: • దేశీ ఆవు పేడ 10 కేజీలు 2. దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు . బెల్లం 2 కేజీలు పప్పుల పిండి 2 కేజీలు నీరు 200 లీటర్లు పుట్టమన్ను లేదా పొలం గట్టు మన్ను దోసెడు
జీవామృతాన్ని తయారు చేసే విధానం: మొదట డ్రమ్ములో 200 లీటర్లు నీటిని తీసుకొని దానిలో పది లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి, తరువాత పది కేజీల ఆవుపేడను, రెండు కేజీల పప్పు దినుసుల పిండిని మరియు రెండు కేజీల బెల్లం కూడా డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. పుట్టమన్నును గుప్పెడు కలుపుకోవాలి. ఈ పదార్ధాలు అన్నిటిని కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు నుండి మూడు సార్లు కర్రతో కుడి వైపునకు తిప్పాలి. ఇలా కలిపితే జీవామృతం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుంది. అప్పటి నుంచి వారం రోజుల వరకు సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుందికాబట్టి ఈ రోజుల్లో వాడుకుంటే మంచి ఫలితం వస్తుంది.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
జీవామృతం పంటలకు వాడే పద్దతులు
- 1.నీటితడులతో పారించడం: నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫా 200 లీటర్ల చొప్పున అందించాలి. పంటల వివిధ దశల్లో ఐదు నుండి అరుసార్లు నీటితో పాటు పారించాలి.
- జీవామృతం పిచికారి పద్ధతి: జీవామృతాన్ని బాగా వడగట్టి సరైన మోతాదులో నీటితో కలిపి పంటల వివిధ దశలో మూడు నుండి నాలుగు సార్లు రైతులు పొలాల్లో పిచికారి చేయాలి
- డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల ద్వారా జీవామృతం పారించటం: పండ్ల తోటల్లో, కూరగాయ తోటలకు కొన్నిచోట్ల అర్హుతడి వరికి సైతం జీవామృతాన్ని జాగ్రత్తగా వడగట్టి డ్రిప్ ద్వారా లేదా స్ప్రింక్లర్ల ద్వారా రైతులు అందించవచ్చు
- పై పాటుగా పంటలపై పోయడం: పెరట్లో కూరగాయలు పండించుకునేవారు పంటలపై మొదట్లో వేరు తడిచేలా జీవామృతాన్ని చెంబులు మగ్గులతో అందించవచ్చు.
ఘనజీవామృతం
తయారీకి కావలసిన పదార్థాలు
- దేశీ ఆవు పేడ 100 కేజీలు
- దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు
- బెల్లం 2 కేజీలు
- పప్పుల పిండి 2 కేజీలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు)
- పిడికెడు పుట్ట మట్టి
తయారు చేసే విధానం: నీడలో పేడ కుప్ప పోసి అందులో పిండి, బెల్లం, మట్టి వేసి కొంచెం కొంచెం మూత్రం కలుపుతూ ముద్దగా పిసకాలి. అన్ని కలిపిన తర్వాత నీడలో ఆరబోయాలి. 48 గంటలు గడిచిన తర్వాత దీన్ని పలుచగా చేసి అరబెట్టుకోవాలి. పది రోజులు అరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది. తయారుచేసిన వారం రోజుల్లో పొలంలో వెదజల్లి దుక్కిదున్నవచ్చు. నిల్వ చేసుకుని తదనంతరం వాడుకోవాలనుకుంటే పూర్తిగా అరిపోయిన తర్వాత గోనెసంచులలో నిలువ చేసుకోవాలి. పంటలకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇలా తయారుచేసిన ఘనజీవామృతం ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోల ఘనజీవామృతం వేసుకోవాలి. దానితోపాటు పైపాటుగా ఎకరానికి కనీసం మరో 200 కిలోలు వేసుకోగలిగితే మంచిది. ఇలా వేయడం వల్ల పంటలకు పోషకాల లోపం లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
డాక్టర్ ఎన్. ప్రతాప్ రెడ్డి, డాక్టర్ సంబాజి దత్తాత్రేయ నల్కర్, రవి
పాల్తియ, ఎం శ్రీనివాస్, ఎం. ఉదయ కుమార్, ఎం. శ్రీకాంత్ మరియు
డాక్టర్ జి భార్గవి, EGVF – కృషి విజ్ఞాన కేంద్రం, తునికి, మెదక్