చిరు ధాన్యాలతో ఆరోగ్యం

Chiru Dhanyala to Arogyam

Chiru Dhanyala to Arogyam

తృణధాన్యాలు జీవామృతాలు.. తాత ముత్తాతల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న వీటిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. తృణధాన్యాలు పదివేల సంవత్సరాల నుండి మానవ ఆహారంలో ఒక భాగంగా ఉన్నాయి. అయితే ఆధునిక జీవనశైలి కొత్త కొత్త ఆహారపు అలవాట్లు మన జీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలైన తృణధాన్యాల ను పక్కకు పెట్టాం. అయితే మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలు, ఆహారపు అలవాట్లు మరియు మారిన జీవనశైలి మానవుల ఆరోగ్యానికి హానికరమని.. పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అధికంగా ప్రాసెసింగ్ చేసిన ధాన్యాలు తీసుకోవడంవలన ఊబకాయం వంటి అనేక అరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే తృణధాన్యాలు మంచి ఆరోగ్యకరమైన శరీరానికి, కండపుష్టికి అనువైన ఆహారం, తృణధాన్యాలు తినడం వలన మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది.

జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు.. వీటినే తృణ ధాన్యాలు(చిరుధాన్యాలు) అంటారు. వీటన్నింటిలో ఉండే పోషకాలు, కాల్షియం, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మనిషికి వచ్చే రకరకాల లైఫ్ స్టయిల్ రోగాలను రానివ్వవు. ప్రతి రోజు చిరుధాన్యాలను తినడం అలవాటు చేసుకుంటే.. ఎటువంటి వ్యాధి కూడా దరిచేరదు. ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, రక్తస్రావం వంటి సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు తృణ ధాన్యాలను తింటే వాళ్లకు ఆ సమస్యలు తీరుతాయి. అందుకే ఇప్పుడు చిరు ధాన్యాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. చిరుధాన్యాలు పోషకవిలువలలో దాదాపు గోధుమలతో సరితూగును.

Also Read చిరుధాన్యాల వంటకాలతో రుచి-ఆరోగ్యం

మాంసకృత్తులు దాదాపు 10% బరువును కలిగివుంటాయి. విటమిన్ బి12, బి17, బి6, కూడా ఎక్కువ శాతం వుంటాయి. ఎక్కువ పీచుపదార్థాలు కలుగివుంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచివి. అంతేకాక చిరుధాన్యాల్లో పిల్లలకు, వృద్దులకు కావలసిన పోషకాలు ఎక్కువగా వుండుటచేత భారతదేశంలో వీటి వాడుక ఎక్కువ. చిరుధాన్యాల ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను, మన ఆరోగ్యంలో అవి వహించే పాత్రను, వాటి ఉత్పత్తిని త్పత్తిని మార్కెటింగ్ సౌకర్యాన్ని మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయడానికి మరియు ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆహార అలవాట్లు, ఆహార భద్రతా దృష్ట్యా ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

తృణధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చిరుధాన్యాలు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, చిరుధాన్యాల్లో ఉండే అనేక రకాల పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. రాగులు, సజ్జలు, కొర్రలు, అరికలు, వరిగెలు, సామలు ఇలా ఇంకా చాలానే చిరు ధాన్యాలు ఉన్నాయి. అయితే వీటితో చాలా మంది రొట్టెలతో పాటు, అన్నం తరహాలో కూడా వండుకొని తింటారు. కాల్షియం రాగుల్లో ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పిల్లలకు ఆహారంలో రాగి ముద్ద పెడితే ఎముకలు దృఢంగా మారడంతో పాటు దంతాలు కూడా దృఢంగా ఉంటాయి. చిరు ధాన్యాలైన కొర్రలు, సజ్జల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. బియ్యం, ఇతర ధాన్యాలతో పోలిస్తే, ఇందులో డైటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొర్రలను ఉడికించి అన్నంలా తింటే కడుపు నిండుతుంది, తరుచూ తినాలనే కోరిక తగ్గుతుంది. రాగుల్లో ఉండే పాలీఫెనాల్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఐరన్, విటమిన్ సి: చిరు ధాన్యాల్లో ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.

సహజమైన యాంటిడిప్రెసెంట్

చిరుధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే అమినో యాసిడ్ నేచురల్ యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది.
రెగ్యులర్ మైగ్రేన్లతో బాధపడే వారికి ఇది మంచిది. పిల్లలకు పోషకాహారం అందించడం: పెరిగే పిల్లలకు చిరుధాన్యాలు ఇస్తే శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి.

నాడీ వ్యవస్థను బలోపేతం చేయడం

చిరు ధాన్యాల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ అధికంగా ఉంటుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది, మనస్సును ప్రశాంతపరుస్తుంది. మిల్లెట్ ఆందోళన, నిద్రలేమిని తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. రాగిలోని ట్రిప్టోఫాన్ కంటెంట్ న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఎన్నో ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలను సమపాళ్లలో మన ఆహారంలో భాగం చేసుకొని, మన ఆరోగ్యం కాపాడుకొని “ఆరోగ్యమే మహాభాగ్యం”అనే సామెతను మనమందరం నిజం చేద్దాం. భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు సరిపడా నాణ్యమైన పోషక విలువలున్న ఆహారాన్ని అందించడం మనముందున్న సవాలు, ఈ దిశలో చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా వుంది. ప్రస్తుతం మన దేశ జనాభాలో ఎక్కువ మంది వరి, గోధుమ మీదే ఆధారపడుతున్నారు. దీనివలన ఆహార కొరత, భద్రత ప్రమాద స్థాయికి చేరే ప్రమాదముంది.

చిరుధాన్యాలతో మధుమేహం, స్థూలకాయం, వ్యాధి నియంత్రన

ఈ పరిస్థితిని అధిగమించడానికి మనకు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన చిరుధాన్యాల పంటల సాగును ప్రోత్సహించవలసి ఉన్నది. చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఇతర తృణధాన్యాలైన వరి, గోధుమలకన్నా ఎక్కువ పోషక విలువలు కలిగి ఆరోగ్యరీత్యా చాలా శ్రేష్టమైనవిగా గుర్తించాలి. వీటిలో ఇనుము, కాల్షియం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. చిరుధాన్యాలు ఎక్కువ పీచు పదార్థాలు, ఎక్కువ మినరల్స్ కలిగి ఉండడమే కాకుండా నిదానంగా జీర్ణమయ్యే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ చిరుధాన్యాలు మధుమేహం, స్థూలకాయం వంటి వ్యాధిగ్రస్తులు ఉపయోగించుట వల్ల వ్యాధిని నియంత్రించవచ్చును. ఇవిఆహారంగా ఉపయోగపడుటమే కాకుండా, చక్కని పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి.

చిరుధాన్యాలను వివిధ వాతావరణ పరిస్థితులలోను అన్ని ప్రాంతాలలోనూ పండించవచ్చు. ఇవి బెట్టను బాగా తట్టుకుంటాయి. చీడపీడలు చాలా తక్కువ. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి రోజు, రోజుకు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో వాటిని ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ మధ్య కాలంలో రైతులు వాణిజ్య పంటల ద్వారా ఆదాయం వస్తుందనే ఆలోచనలోపడి చిరుధాన్యాల సాగును చాలా కాలం నుండి విస్మరించారు. దీనివలన పోషక విలువలున్న ఆహారం తినడం తగ్గిపోయి. ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రస్తుత కాలంలో ప్రజలలో ఆహారపు విలువలు పోషకాలపై ఆసక్తి పెరిగి చిరుధాన్యాల వాడకం క్రమేణ పెరుగుతూ, ఈ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఏర్పడుతోంది. కనుక రైతులు ఈ విషయాన్ని గ్రహించి పోషక విలువలున్న చిరుధాన్యాల సాగుపై మొగ్గుచూపి, తద్వారా వారి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంది.

రైతులు అనాది కాలంగా పండిస్తున్న రకాలకు తగినంత ఎరువులు వాడకపోవడం, యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడం మూలాన దిగుబడులు ఆశాజనకంగా ఉండడం లేదు. దిగుబడి పెంచడమే కాకుండా పంటకోత తరువాత అనుసరించవలసిన పద్ధతులను పాటించి చిరుధాన్యాలను మార్కెట్లో సులువుగా అమ్ము కునేందుకు వీలుగా విలువ ఆధారిత (Value Added) పదార్థాలను తయారుచేసి వినియోగదారులకు పోషకాహారాలతో కూడిన ఆహారాన్ని అందించి, మంచి లాభాలను పొందవచ్చు. ఆ దిశగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. చిరుధాన్యాల వంటలు పండించే విషయానికి వచ్చినట్లైతే ఈ పంటలు తక్కువ వర్షపాతంలో అంటే 200 నుండి 600 మి.మీ. వర్షపాతములో పండగలవు. బలహీనమైన, తేలిక భూములలో కూడా సాగు చేసుకోవచ్చు. మెట్ట సేద్యంకు చాల అనుకూలమైన పంటలని చెప్పవచ్చు. వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తిగల పంటలు, ప్రత్యామ్నాయ పంటలకు ఈ చిరుధాన్యాల పంటలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తక్కువ నీరు, తక్కువ ఎరువులు, అతి తక్కువ పురుగు మందులు అవసరం మేరకే ఈ పంటలకు వాడుతారు. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు, బంజర భూములలో రైతులు లాభసాటిగా సాగుచేయడానికి అనుకూలమైన పంటలు ఈ చిరుధాన్య పంటలు.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top