ఈ వరదకు ప్రకాశం బ్యారేజి తట్టుకుంటుందా..?
ద్రవం ఉన్నచోట.. ఉపద్రవం తప్పదు
ఉప్పున్న చోట.. ఉప్పెన తప్పదు ..
…శివ రాచర్ల ..
ప్రాజెక్టులు డిజైన్ చేసేటప్పుడు గతంలో వచ్చిన వరద లెక్కలు చూస్తారు. మన దగ్గర దాదాపు 150 సంవత్సరాలలో వచ్చిన వరద లెక్కలు ఉన్నాయి. గరిష్ట వరద వచ్చినపుడు ఎంత మేర ముంపు వచ్చింది, ఏ ప్రాంతాలు మునిగిపోయాయి . ఇలాంటి లెక్కల ఆధారంగానే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది.
ఎన్ని నీళ్లు నిలువ చేయొచ్చు అనేది ముఖ్యమే కానీ భారీ వరద వచ్చినప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జి చెయ్యాలన్న లెక్క ఆధారంగా స్పిల్ వే లెంగ్త్ ,గేట్ల సంఖ్య నిర్ణయిస్తారు.
1852లో సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడు ఆమోదించిన డిజైన్ ప్రకారం కెప్టెన్ చార్లెస్ ఆర్ ఇప్పుడు బ్యారేజి ఉన్న స్థలంలో ఆనకట్టను నిర్మించారు. 1903లో 11,90,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ వరదకు ఆనకట్ట తట్టుకొని నిలిబడింది.
14-Sep-1952లో వచ్చిన వరదలకు ఆనకట్టకు గండి పడి ఎనిమిది మంది చనిపోయారు ఆనకట్టను పరిశీలించటానికి పంటి(ఒక రకమైన బోట్ ) మీద వెళ్లిన ఇంజనీర్ వేపా కృష్ణమూర్తి గారు పంటి మునగడంతో చనిపోయారు.
ఆనకట్ట స్థానంలో బ్యారేజి కట్టాలని భావించినా రాష్ట్ర విభజన వలన అది ఆలస్యం అయ్యింది. ఆంధ్రరాష్టం ఏర్పడిన తరువాత 13-Feb-1954న నాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు బ్యారేజీకి శంకుస్థాపన చేశారు. బ్యారేజి నిర్మాణానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. 24-Dec-1957న నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు బ్యారేజీని ప్రారంభోత్సవం చేశారు. ప్రకాశం పంతులు గారు 20-May-1957న చనిపోయారు. ఆయన జ్ణాపకార్ధం బ్యారేజీకి ప్రకాశం బ్యారేజి అని పేరు పెట్టారు.
శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మణం పూర్తి కావటంతో ప్రకాశం బ్యారేజికి వరద తాకిడి తగ్గింది. 1998లో తొలిసారి 9,47,000 క్యూసెక్కుల వరద వచ్చింది,ఆ తరువాత 2009లో 11,10,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ రోజు అంటే 02-Sep-2024 మధ్యాహ్నం 2 గంటలకు 11,43,200 క్యూసెక్కుల వరద రికార్డ్ అయ్యింది.
బ్యారేజి దెబ్బతింటుందా..?
విజయవాడలో కొన్ని ప్రాంతాలు మునిగిపోవటం,రైల్ వే బ్రిడ్జికి రెండు అడుగుల కింది వరకు నీళ్లు ప్రవహిస్తుండడంతో బ్యారేజి నిలబడుతుందా?. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి?. దీనికి తోడు మూడు బోట్లు కొట్టుకొని వచ్చి పిల్లర్లను బలంగా ఢీకొట్టడంతో కొంత డ్యామేజీ జరగటం వలన కూడా బ్యారేజి భద్రత మీద భయం నెలకొన్నది.
AlsoRead https://politicalhunter.com/nallamala-tiger-forest/
బ్యారేజి స్టోరేజ్ కెపాసిటి 3 టీఎంసీలు కాగా డిశ్చార్జి కెపాసిటీ 11,90,000 క్యూసెక్కులు .. కానీ దీనికన్నా అదనంగా అంటే బ్యారేజి మీద ఓవర్ ఫ్లో అయినా కూడా బ్యారేజీకి ఏమి కాదు. డిజైన్ చేసేటప్పుడే ఓవర్ ఫ్లో ను కూడా పరిగణిస్తారు. నా ఉద్దేశ్యంలో వరద మరో ఐదు ఆరు అడుగులు పెరిగినా బ్యారేజీకి ఏమి కాదు.,మరో విధముగా చెప్పాలంటే వరద మరో లక్ష – లక్షన్నర క్యూసెక్కులు పెరిగినా బ్యారేజి సేఫ్.
ఈ రాత్రికి ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుతుందని CWC అంచనా వేసింది. ఖమ్మంలో కూడా గత రెండు రోజులతో పోల్చుకుంటే వర్షం తగ్గింది. ప్రకాశం బ్యారేజీకి పులిచింతల దిగువన ఖమ్మం వైపు నుంచి మున్నేరు ద్వారా భారీ వరద వస్తుంటుంది. తక్కువ దూరం కావటం పాలేరు,వైరా, లంక సాగర్,మున్నేరు లు ఉదృతంగా ప్రవహించడంతో ప్రకాశం బ్యారేజీకి రాత్రికి రాత్రి రెండు మూడు లక్షల క్యూసెక్కుల వరద చేరుతుంటుంది,కృష్ణా నది వరదను అంచనా వేసినట్లు మున్నేరు వరదను అంచనా వేయలేరు.
నిన్నటితో పోల్చుకుంటే మున్నేరు వరద కూడా తగ్గింది.ఈ రోజు 1,80,000 క్యూసెక్కుల వరద ఉంది.
విజయవాడ ముంపుకు కారణం కృష్ణా నీళ్లా..?
విజయవాడ సింగ్ నగర్,పాల ఫ్యాక్టరీ ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. దీనికి కారణం బుడమేరు వాగు నీళ్లు. బుడమేరు మీద వెలగలేరు వద్ద ఉన్న లాకులను తెరవటంతో ఆ నీరు పొంగిపొర్లి టౌన్ లోకి వచ్చింది. గతంలో అయితే కృష్ణాకు వరద వస్తే కృష్ణలంక లాంటి ప్రాంతాలు ముంపుకు గురైయ్యేవి కానీ 2019 ముందు మొదలు పెట్టిన రీటైనింగ్ వాల్ నిర్మాణం గత ప్రభ్యత్వహయాంలో పూర్తికావటం వలన ఈసారి కృష్ణలంక ముంపుకు గురి కాలేదు.
విజయవాడను ముంపుభారి నుంచి రక్షించాలంటే బుడమేరు ఆక్రమణలు తొలగించి ఆధునీకరణ చెయ్యాలి,బుడమేరు డైవర్షన్ స్కీం ను 100% పూర్తి చెయ్యాలి.
దివిసీమకు ముప్పు
ఈ వరద వలన దివి సీమ ముఖ్యంగా నాగాయలంక, కోడూరు ప్రాంతాలు భారీ ముంపుకు గురవుతున్నాయి.ఈ రాత్రి గడిస్తే దివి సీమకు గండం తప్పినట్లే.
వరద కాలంలో రాజకీయ విమర్శలు అనవసరం.. ఇప్పుడు కావలసింది కేవలం సహాయం మాత్రమే.
నిన్న అంచనా వేసినట్లు ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గింది. ఈ ఉదయం అంటే 03-Sep-2024 ఉదయం 6:30 గంటలకు 9,64,176 క్యూసెక్కుల వరద వస్తుంది.
https://www.facebook.com/100000801631993/videos/2546656418867843
ఎగువన అంటే శ్రీశైలం – నాగార్జున సాగర్- పులిచింతల నుంచి 5,40,000 క్యూసెక్కుల వరద వస్తుంది.. మున్నేరు నుంచి మాత్రం కేవలం 17,203 క్యూసెక్కులు మాత్రమే వస్తుంది..
ఈ మధ్యాహ్నంకు వరద ఇంకా తగ్గుతుంది.. ఈ తెల్లవారు జాము నుంచి మొదలైన వాన వరదాగా మారి ప్రకాశం బ్యారేజీని తాకటానికి సమయం పడుతుంది.