బీజేపీ యువతి మైథిలీ ఠాకూర్ చారిత్రక విజయం

BJP s young woman Maithili Thakur achieves historic victory

BJP s young woman Maithili Thakur achieves historic victory

  • ముస్లిం నియోజకవర్గంలో బీజేపీ యువతి మైథిలీ గెలుపు

సంగీత ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 25 ఏళ్ల యువ గాయని మైథిలీ ఠాకూర్ బీహార్ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. దర్భాంగాలోని కీలకమైన అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిపై 8,544 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచి బిహార్ అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు బీజేపీ అడుగుపెట్టని ఈ నియోజకవర్గంలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు.

సాంస్కృతిక పునరుజ్జీవం, మహిళా విద్య, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికల్లో ఆమె ప్రచారం సాగించారు. 2024లో శబరి మీద పాడిన ఆమె పాట ప్రధాని మోదీని ఆకర్షించింది. ప్రధాని ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. సాధారణంగా ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న అలీనగర్ నియోజకవర్గం సంప్రదాయంగా ఆర్జేడీకి కంచుకోటగా ఉండగా.. ఇలాంటి స్థానంలో బీజేపీ తొలిసారిగా గెలుపొందడం అనేది ఆ పార్టీ వ్యూహాత్మక విజయంగా మారింది.

మిథిలాంచల్ ప్రాంతంలో సరికొత్త అధ్యాయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మైథిలీ ఠాకూర్ ఆపై రైజింగ్ స్టార్ వంటి రియాలిటీ షోల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తన సాంస్కృతిక వారసత్వాన్ని రాజకీయాలకు వారధిగా మలచుకున్నారు. మైథిలీ ఠాకూర్, ఆమె సోదరులు రిషవ్, అయచి కలిసి చేసిన జానపద గీతాలు, రామచరితమానస్ గానం టీవీలు, సోషల్ మీడియాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టాయి.

ఈ సాంస్కృతిక మూలాలే ఆమెకు రాజకీయాల్లో బలమైన పునాదిగా మారాయి. 2000 జూలై 25వ తేదీన జన్మించిన మైథిలీ ఠాకూర్ 25 ఏళ్ల వయసులోనే బిహార్ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గతంలో ఈ ఘనత సాధించిన తేజస్వీ యాదవ్ (26 ఏళ్లు), తౌసీఫ్ ఆలం (26 ఏళ్లు) రికార్డులను మైథిలీ ఠాకూర్ అధిగమించనున్నారు.

మైథిలీ ఠాకూర్ ప్రచారంలో కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు.

ఆమె సోదరులు ప్రదర్శనలు ఇవ్వగా, మేనమామలు నంద్ కిషోర్ ఝా, సుమిత్ ఝా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇది ఆమె సాంస్కృతిక వారసత్వాన్ని, కుటుంబ విలువలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు. మైథిలీ ఠాకూర్ తన రాజకీయ ప్రణాళికను సాంస్కృతిక పునరుజ్జీవం, సామాజిక సంస్కరణల మిశ్రమంగా ప్రకటించారు.

పాఠశాలల్లో మిథిలా ఠాకూర్ పెయింటింగ్‌ను అదనపు పాఠ్యేతర అంశంగా ప్రవేశపెట్టడం, అలాగే అలీనగర్ పేరును ‘సీతానగర్’గా మార్చాలనే ప్రతిపాదన ఆమె ఎన్నికల హామీల్లో ముఖ్యంగా వినిపించింది. విద్యారంగంపై, ముఖ్యంగా బాలికల విద్య, స్థానిక యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలపై ఆమె దృష్టి సారించారు. 2019లో ఎన్నికల కమిషన్ ద్వారా మధుబని జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన మైథిలీ ఠాకూర్ ఇప్పుడు అధికారికంగా రాజకీయ వేదికపైకి అడుగుపెట్టారు.

51 ఏళ్ల సగటు వయసున్న బిహర్ అసెంబ్లీలో 25 ఏళ్ల యువతి అడుగు పెట్టడం బిహార్ రాజకీయాల్లో యువతకు ఆదర్శనంగా నిలవడమే కాకుండా, కొత్త శకానికి నాంది పలికినట్లయింది. ఆమె తండ్రి రమేశ్‌ ఠాకూర్‌ శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, టీచర్‌. తల్లి భారతి గృహిణి. రమేశ్‌ చిన్నప్పటి నుంచే కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆమె సోదరులు అయాచీ, రిషబ్‌ కూడా సంగీతం నేర్చుకున్నారు. ఆమె తన జానపద పాటలతో సోషల్‌ మీడియాలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.

తమ పిల్లల సంగీత సాధన ఇతరులకు ఇబ్బందిగా మారుతుండటంతో 17 సార్లు ఇళ్లు మారినట్లు మైథిలీ తల్లి భారతి ఓ సందర్భంలో మీడియాకు వెల్లడించారు. తాము చిన్న గదులను అద్దెకు తీసుకొని జీవనం సాగించినట్టు తెలిపారు. 2017లో ఎట్టకేలకు ఆ కుటుంబం సొంత ఇల్లు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో ఓ అపార్ట్‌మెంట్‌లోకి మారారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top