ప్రస్తుత కాలంలో సామాన్య మానవుడి నుండి పరిశోధకుల వరకూ విశేషంగా ఆకట్టుకుంటున్న సహజ ఔషధ మొక్క అలోవీరా అంటే అతిశయోక్తి కాదు. కేవలం ఆరోగ్య పరిరక్షణకే కాకుండా, సౌందర్య పరిరక్షణకు కూడా విరివిగా ఉపయోగపడే మొక్క ఇది. దీనిని శాస్త్రీయంగా కుమారి అని, వ్యవహారికంగా కలబంద అని అంటారు. ఈ మొక్కను మన ఇళ్ళలో కుండీల్లోనూ, గృహావరణాల్లోనూ, పొలంగట్లపైన, ఉద్యానవనాల్లోనూ పెంచు కోవచ్చు. ఒక గుత్తిలాగా మొక్క మొదలునుండి పత్రాలు వచ్చే బహువార్షిక మొక్క ఇది. ఈ మొక్క ఆకుల అంచులు ముళ్ళవంటి దంతాలు కలిగి ఉంటాయి. ఈ ఆకులు కోలగా, దళసరిగా సుమారు 50 సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. కనుక దీనిని స్థూలదళ అని, ఆకుల్లో మిక్కిలి జిగురు పదార్థం నెయ్యిలాగా ఉండటంతో ఘృతకుమారి అని కూడా సంస్కృతంలో వ్యవహరిస్తారు.
గుజ్జులో అత్యల్ప ప్రమాణంలో ఒక విధమైన తైల పదార్థం ఉండటం వల్ల ఇది మదపు వాసనను కలిగి ఉంటుంది. ఈ గుజ్జులో గ్లకోసాయిడ్, ఐసోబార్బలాయిన్, అలోఎమోడిన్, రెసిన్స్ మొదలైన రసాయనాలు ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. అలోవీరా దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో రకాలైన రుగ్మతలను దూరం చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. మృదు విరేచనం కలుగజేస్తుంది. స్త్రీలలో రుతు రక్తాన్ని జారీ చేస్తుంది. అమిత వేడిని తగ్గిస్తుంది. ప్రస్తుతం నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలను అలోవీరా ద్వారా ఎలా తగ్గించుకోవచ్చునో ఈ వ్యాసంలో తెలుసుకుందాం. ఒక గ్లాసు పాలలో రెండు స్పూన్ల అలోవీరా గుజ్జు రసం తగినంత పటిక బెల్లం పొడి కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటూ ఉంటే మూత్ర విసర్జన సమయంలో కలిగే మంట, నొప్పి, రక్తస్రావం, పేగుపూత, స్త్రీలలో గర్భాశయ వ్రణాలు తగ్గుతాయి. గనేరియా వంటి సుఖరోగాల్లో సత్వర ఉపశమనం కలుగుతుంది.
Also Read దగ్గు, ఆయాసం, కడుపుబ్బరం, మంటకు అతిమధురం’ వైద్యం
అలోవీరా గుజ్జును కాలిన గాయాలపై పూస్తూ ఉండటం వల్ల మంట తగ్గడమే కాకుండా, బొబ్బలెక్కకుండా ఉంటాయి. అలోవీరాలో ఉండే టి. ఎక్స్ ఎ టి 2 అనే రసాయనం నొప్పిని తగ్గించడమే కాక, మృత కణాల స్థానంలో కొత్త కణాల ఉత్పతికి దోహదపడటం వల్ల చర్మం త్వరగా సాధారణ స్థితిని సంతరించు కుంటుంది. ఎక్కువగా ఎండలో తిరగటం వల్ల, ఎక్కువ శ్రమ చేయడం వల్ల, నిద్రలేమి వల్ల కళ్లు మంటలు ఉండి, ఎర్రబడినపుడు అలోవీరా గుజ్జును శుభ్రమైన నీటితో కడిగి తెల్లటి పరిశుభ్రమైన బట్టలో మూటకట్టి కళ్ళపై పెట్టుకుంటే చాలా మంచిది. తద్వారా కళ్లు చల్లగా ఉండి కనుబొమల వాపు, రెప్ప వాపు, పుసులు కట్టడం, నీరు కాండం వంటి కళ్ల కలక లక్షణాలు కూడా తగ్గుతాయి. అలోవీరా గుజ్జులో పసుపు కలిపి పైకి రాస్తుంటే చర్మంపై మచ్చలు, గరుకుతనం తగ్గి చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
అలోవీరా గుజ్జు రసం మంచి ఔషదం
ఒక భాగం సోపు గింజల మెత్తటి చూర్ణానికి నాలుగు భాగాల అలోవీరా గుజ్జు రసం కలిపి బాగా ఎండించి నిలువ ఉంచుకుని అరస్పూను ప్రమాణంలో రోజూ రెండుసార్లు నీటితో కలిపి సేవిస్తుంటే కడుపులోనూ, ప్రేవుల్లోనూ ఉండే పుండ్లు, కడుపు ఉబ్బరం, కడుపులో వికారం తగ్గుతాయి. పరిశోధనల్లో కూడా అలోవీరా గుజ్జుకు అల్సర్ను నయం చేసే గుణమున్నట్లు శాస్త్రీయంగా కనుగొన్నారు. అలోవీరా గుజ్జు రసాన్ని రెట్టింపు కొబ్బరి నూనెలో కలిపి సన్నటి మంటపై రసం ఇగిరేంత వరకూ మరిగిస్తూ చివరలో తగినన్ని మరువం ఆకులు వేసి కాచి చల్లార్చి వడగట్టి కేశతైలంగా వాడుకుంటే తల వెంట్రుకలు అందంగా, ఆకర్షణీయంగా, మృదువుగా ఉండటమే కాక, తలలో దురద, చుండ్రు తగ్గుతాయి.
కానుగ నూనెలో తగినంత అలోవీరా రసం కలిపి ఒంటికి పట్టించుకొని రెండు మూడు గంటలు ఆగి స్నానం చేస్తుంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవడమే కాక, పొరలు పొరలుగా పొట్టు ఊడిపోయే సోరియాసిస్ వంటి వ్యాధుల్లో గుణం కనిపిస్తుంది. వేయించిన జీలకర్ర పొడి, స్వచ్ఛమైన పసుపు పొడి, పటికబెల్లం పొడి సమానంగా కలిపి ఉంచుకొని, నీటితో శుభ్రంగా కడిగిన ఒక స్పూను అలోవీరా గుజ్జును ఈ చూర్ణంలో అద్దుకుని రోజూ రెండుసార్లు సేవిస్తే స్త్రీల గర్భాశయ కంతులు, గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. అలోవీరాను గర్భవతులు సేవించడం వల్ల గర్భస్రావం, పాలిచ్చే తల్లులు సేవించడం వల్ల ఆ పాలు తాగే పిల్లల్లో ఎక్కువసార్లు విరేచనం అయ్యే ప్రమాదం ఉన్నందున వారు సేవించకుండా ఉంటే మంచిది. ఆయుర్వేద ఔషధాలైన కుమార్యాసవ, రజప్రవర్తినీవటి వంటి ఔషధాల తయారీలో అలోవీరాను ఉపయోగిస్తారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV