“మరణంలోనూ జీవం’ పోయడం అంటే ఇదేనేమో! కొడుకు మరణించినా, ఆ బాధను దిగమింగుకుని ఇతరులకు జీవం పోయాలని నిర్ణయించుకున్నారు ఆ తల్లిదండ్రులు. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఎవరూ సహాయం చేయకపోవడం వల్లనే ప్రశాంత్ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడనే విషాదకర వాస్తవం ఈ కథనంలో మరో కోణం. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడు, తన అవయవదానం ద్వారా ఇప్పుడు అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాడు. మానవత్వం మరచి నిర్లక్ష్యం వహించిన సమాజాన్ని ప్రశ్నిస్తూనే, కన్నీళ్లను సైతం పక్కన పెట్టి, గొప్ప మానవత్వంతో ముందుకు వచ్చిన ఆ ఆదర్శ కుటుంబాన్ని, వారి నిర్ణయాన్ని అభినందిస్తూ… ప్రత్యేక కథనం.
నంద్యాల జిల్లా, పాములపాడు మండలం, భానుముక్కుల టర్నింగ్ వద్ద ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. బైక్ పై వెళుతున్న ఆత్మకూరు వాసి ప్రశాంత్ (32) అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే, ఇక్కడే మరో విషాదకరమైన కోణం ఉంది. రోడ్డు మీద వచ్చి పోయేవారు ప్రశాంత్‌ను చూశారే తప్ప, ఎవరు కూడా అతని దగ్గరకు వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయడం గానీ, ఆసుపత్రికి తరలించే ప్రయత్నం గానీ, 108కి ఫోన్ చేయడం గానీ చేయలేదు. సుమారు అరగంటసేపు ఎవరూ పట్టించుకోకపోవడంతో, తలలో బ్లీడింగ్ ఎక్కువైంది. ఈ నిర్లక్ష్యం కూడా ప్రశాంత్ మరణానికి మరొక కారణంగా నిలిచింది. ఈ సంఘటన ‘సమాజం ఎక్కడికి వెళ్తోంది’ అని ప్రశ్నించే విధంగా ఉంది.
ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత కారణంగా, మెరుగైన చికిత్స కోసం ప్రశాంత్‌ను కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రశాంత్… ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక తుది శ్వాస విడిచాడు. కొడుకు మరణంతో కుంగిపోయినప్పటికీ, ప్రశాంత్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, కృష్ణవేణి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అవయవదాణం చేసిన ఆత్మకూరు ప్రశాంత్
తన కొడుకు మరణించి కూడా పలువురికి జీవం పోయాలనే గొప్ప సంకల్పంతో… వారు ప్రశాంత్ అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు.ప్రశాంత్ అవయవాలను ‘ఆంధ్రప్రదేశ్ జీవనాధార్ సంస్థ’కు అప్పగించారు. తల్లిదండ్రులు చూపిన ఈ సాహసం, మానవత్వం ఇప్పుడు స్థానికంగా అందరికీ ఆదర్శంగా నిలిచింది. కొడుకును కోల్పోయినా… ‘అవయవదానం’ ద్వారా పది మందికి ప్రాణం పోసిన ఈ కుటుంబానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాను మరణించి కూడా పలువురికి జీవం పోయనున్న ఆత్మకూరు వాసి ప్రశాంత్… ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. మరణానంతరం కూడా తన అవయవాల ద్వారా ఇతరులకు జీవం పోయాలని నిర్ణయించుకున్న ప్రశాంత్‌కు, మరియు ఆ గొప్ప నిర్ణయం తీసుకున్న వారి తల్లిదండ్రులకు హ్యాండ్సప్
#Prashanththesouldonor











