మహానంది పులిహోర ఘుమఘుమల వెనుక
(కథనం రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డి – సీనియర్ జర్నలిస్ట్ )
స్వామి దర్శనం అయ్యాక…మనసు ప్రసాదాల వైపు మళ్ళుతుంది. కౌంటర్ లో లడ్డుతో పాటు పులిహోర పొట్లం లేకుంటే తీవ్రంగా నిరుత్సాహ పడుతారు
భక్తులు ఈ పులిహోర రుచికి అంతగా అలవాటు పడ్డారు నేను ఇదే విషయం గతం లో
(మూడేళ్ల క్రితం ) రాసినట్టు ఏ దేవస్థానం వద్ద ఇంతటి ఘుమఘుమల పులిహోర ఉండదు.
మహానంది కి వచ్చే భక్తులు కోనేటిలో జలకమాడుతారు.
నా చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను రుచిలో ఏమాత్రం తేడా లేదు. కాకపొతే .. వి ఐ పి లు దేవస్థాన సందర్శనకు వచ్చినప్పుడు మాత్రం..
పులిహోరలో జీడిపప్పు కూడా కనిపిస్తుంది. అంతే తేడా.. నేను నంద్యాలలో ఉన్న రోజుల్లో…ఇక్కడి పూల కోనేరులో ఈతకొట్టి, ఆనక పులిహోర పొట్లాలు కొనుక్కునేందుకే మహానంది వచ్చిన సందర్భాలున్నాయి.
దశాబ్దాల నుంచి ఇంత మంచి పులిహోర అందించడం ఎలా సాధ్యం అని పరిశోధిస్తే, ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న కుమారయ్య అనే వంట మాష్టర్ ఘనత ఇది అని తెలిసింది.
గడిచిన 40 ఏళ్లుగా ఆయన ఇక్కడే పని చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో వీరి కుటుంబం తమిళనాడు నుంచి ప్యాపిలికి తరలి వచ్చింది.
వంశ పారంపర్య విద్యను ఈయన కూడా వంటబట్టించుకున్నారు. 1982 లో మహానంది దేవస్థానం లో కొలువు దక్కించుకున్నారు. ఇక అప్పటినుంచి ఇక్కడే పని చేస్తున్నారు.
మహానంది ఈశ్వరుడి ఖ్యాతికి తగినట్లుగానే ఈ కుమారయ్య గారు కూడా నాణ్యమైన ప్రసాదాలు అందిస్తున్నారు. తమిళనాడు రుచులు మహానంది దాకా తెచ్చిన ఈ మాష్టారుకు నా ధన్యవాదములు.
15-10-2023 నాడు నేను మహానంది వెళ్ళినప్పుడు వంటశాలకు వెళ్లి ఈ మాష్టార్ ను కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.
భక్తులకు ఆయన అందిస్తున్న పులిహోర సేవలను కీర్తించి వివరాలు రాబట్టాను. అయితే వంటశాల మెట్లు దిగేటప్పుడు ఈయన చెప్పిన వార్త నా చెవులకు ఏమాత్రం రుచించలేదు.
అదేమంటే, ఈయన రిటైర్మెంట్ ఈ జనవరి లోనేనట.
ప్రస్తుత ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి రెండు దశాబ్దాలుగా నాకు మిత్రుడు. ఎమ్మెల్యే సహకారంతో దేవస్థానం అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు.
ఆయనకు నా రిక్వెస్ట్ ఏమంటే, ఈ స్వామి రిటైర్ అయ్యాక కూడా మహానంది పులిహోర ఖ్యాతి తగ్గకుండా చూడమని.
మహానది పుణ్య క్షేత్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని , నంద్యాల జిల్లా ఉంది నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి.
మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవ నందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవ నందులలో మహానంది ఒకటి.
ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానంది ఆలయం ఉంది ఇది మహా శివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం.