నంద్యాల ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థి ఎవరు..?

Nandyal.jpg

*నంద్యాల ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థి ఎవరు..?*

(———కాశీపురం ప్రభాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ )

నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ పై అందరికి ఆసక్తే.

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి, మాజీ ప్రధాని పి వి నరసింహా రావు లాంటి హేమా హేమీలు

ప్రాతినిధ్యం వహించిన నంద్యాల పార్లమెంటు సెగ్మెంట్ అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు,?

నాకు తెలిసినంతవరకు ప్రస్తుత ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారే వైసీపీ తరఫున మళ్లీ అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు . కాగా, టీడీపీ తరుపున ఎవరు నిలబడతారో ఇంతవరకు స్పష్టత లేదు.

నియోజకవర్గంలో 20% పైగా ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్న దృష్ట్యా ప్రధాన పార్టీల నుంచి ముస్లిం అభ్యర్థి ని రంగంలో దించుతారని అందరూ భావించారు. నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు,సిరివెళ్ల, చాగలమర్రి, బనగానపల్లె, డోన్ పట్టణాల్లో మైనారిటీ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. టీడీపీ తరుపున మాజీ మంత్రి NMD ఫరూక్, వైసీపీ తరుపున సినీ నటుడు ఆలీ ఎన్నికల పోరులో ఉంటారని తొలుత వార్తలు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి గా సిట్టింగ్ ఎంపీ పోచా నే మళ్ళీ రంగంలోకి దించడం దాదాపు ఖాయమైంది. ఫరూక్ కు నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కేటాయించడం తో ఆయన ఇప్పటికే ప్రచారం లో మునిగి పోయారు. ఇంకో బలమైన మైనార్టీ అభ్యర్థి ఎవరూ టీడీపీ కి దొరకడం లేదు. దీంతో టీడీపీ తరుపున నంద్యాల ఎంపి స్థానానికి ఎవరు నిలబడతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

గతంలో ఎన్నడూ లేనిది ఈసారి ప్రతిపక్ష టీడీపీ తరుపున పలువురు అభ్యర్థులు తలపడేందుకు ఉవ్విళ్ళురుతున్నారు.

*టీడీపీ ఆశావహులు ఎవరంటే..*

——-

టిడిపి తరఫున పోటీపడేందుకు ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా ఆసక్తి చూపుతున్నారు. వారిలో మాండ్ర శివానందరెడ్డి, బిజ్జం పార్థసారథి రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లు ఉన్నారు. నాలుగో కృష్ణుడిగా గంగుల ప్రతాపరెడ్డి కూడా రంగంలో దిగొచ్చు.

*1. *మాండ్ర శివానందరెడ్డి*

—– 2019 లో వైసీపీ గాలి ఉధృతంగా విస్తున్న సమయంలో టీడీపీ తరుపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఐపీఎస్ హోదాలో రిటైర్ అయిన మాజీ పోలీస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి కి టీడీపీ టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేక పోయారు. వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి చేతిలో 3 లక్షలు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ పార్టీ తరుపున నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్చార్జిగా నేటి వరకు ఉన్నారు.

నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అల్లూరు ఆయన సొంత గ్రామం. గౌరు వెంకట రెడ్డి కి బావగారు కూడా. సుదీర్ఘకాలం ప్రభుత్వ సర్వీస్ లో ఉండి నందు వల్ల

పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు పలుకుబడి పరిచయాలు తక్కువే అని చెప్పాలి.

అయితే కలిసొచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల నిధుల కొరత లేదు. ఇప్పటికే ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు కూడా ఆయన అభ్యర్థిత్వానికి వ్యతిరేకత చెప్పే అవకాశం లేదు.

2. *బిజ్జం పార్థసారథి రెడ్డి*

——- పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి కూడా టీడీపీ టికెట్ రేస్ లో ఉన్నారు. ఈయన 1999 నుంచి 2004 వరకు పాణ్యం ఎమ్మెల్యే.

కాటసాని కుటుంబానికి రాజకీయంగాను ఫ్యాక్షన్ పరంగాను సంప్రదాయ శత్రువైన బిజ్జం 2004 ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రత్యర్థులతో రాజీ పడ్డారు . అనంతరం పాణ్యం రాజకీయాల నుంచి దాదాపు దూరమయ్యాడు. గడిచిన 20 ఏళ్లుగా ఈయన రాజకీయాల్లో గెస్ట్ పాత్రలకే పరిమితం అయ్యాడు. ఈయన ఏ పార్టీ లో ఉన్నదీ జనాలకు సరైన అంచనా లేదు. పోయిన ఎన్నికల్లో వైసీపీ కి చేసినట్టు వార్తలు వచ్చినందు వల్ల, ఆ తరువాత చెప్పుకోదగ్గ రాజకీయ పరిణామం ఏదీ జరగనందు వల్ల బిజ్జం పార్థసారథి రెడ్డి ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నట్టు లెక్క. అంటే, ఈయనకు టీడీపీ టికెట్ ఇచ్చి మరీ పార్టీ లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

బనగానపల్లె పాణ్యం నియోజకవర్గాల్లో ఈయనకు పట్టు ఉంది.

3. *బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి*

——

ఒకప్పుడు టిడిపి స్టాల్ వార్ట్ అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో ఎవరికి అంచనా లేదు.

ఈయన 1994, 99 లలో నందికొట్కూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓటమి పాలు కావడం, అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజన కావడం ఈయన రాజకీయ భవిష్యత్తు పాలిట శాపంగా మారింది. 2009లో నందికొట్కూరు SC లకు రిజర్వు కావడం తో ఈయన పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో ఓడి పోయారు. తర్వాత టీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షులు గా పని చేశారు.

అనంతరం ఆయన సొంతం గా రాయలసీమ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టి టీడీపీ కి దూరమయ్యారు. రెండేళ్లు తర్వాత ఉద్యమాన్ని పక్కన బెట్టి, కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ చతికిలా పడిపోయింది అని తెలుసుకుని బీజేపీ లో చేరారు. ఏమైందో ఏమో, మళ్ళీ బీజేపీ ని వీడి రాయలసీమ ఉద్యమం చేశారు.

ఇప్పుడు మళ్ళీ టీడీపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు బైరెడ్డి విజయవాడ వెళ్లి నారా భువనేశ్వరి ని కలిసి సంఘీభావం ప్రకటించిన సంగతి విదితమే.

తాజాగా పాణ్యం ఎమ్మెల్యే టికెట్ లేదా నంద్యాల ఎంపి టికెట్ కావాలని బేరం పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.

అయితే పాణ్యం అసెంబ్లీ టీడీపీ టికెట్ ను గౌరు చరితకు ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేశారు. దీంతో నంద్యాల ఎంపి టికెట్ బైరెడ్డి కి ఇచ్చి పార్టీ లోకి తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.

4. *గంగుల ప్రతాప రెడ్డి*

——- ఒకప్పుడు రాజకీయాల్లో ఉద్దాండుడు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గాను, నంద్యాల ఎంపీ గాను రాజ్యసభ సభ్యుడిగాను ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఈ నాయకుడు ఒకటిన్నర దశాబ్దాలుగా ఖాళీగా ఉన్నాడు.

రాయలసీమలో వృద్ద రాజకీయ నిరుద్యోగులు ఎవరు అంటే మైసూరారెడ్డి తర్వాత ఈయన పేరే చెబుతారు.

2017 నంద్యాల ఉప ఎన్నికల్లో కొద్దికాలం హల్చల్ చేశారు.

ఆ తర్వాత మళ్లీ రాజకీయాలకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఉన్నట్టుండి నంద్యాలలో తనకంటూ ఒక కార్యాలయం ఓపెన్ చేసి నేను కూడా ఉన్నాను అంటూ గుర్తు చేస్తున్నాడు.

అయితే, టీడీపీ తరుపున నంద్యాల ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు నాకున్న సమాచారం.

5. *బైరెడ్డి శబరి*

——- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన డాక్టర్ శబరి ప్రస్తుతం బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈమె తండ్రి రాజశేఖర్ రెడ్డి టిడిపిలోకి వచ్చేందుకు నంద్యాల ఎంపీ టికెట్ ను తన కూతురికి కేటాయించాలని అడిగినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ మధ్య ఆమె ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ సదస్సులో పాల్గొన్నారు. తాను బిజెపి వీడే ప్రసక్తే లేదని, టీడీపీ తో పొత్తులో భాగంగా నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ ను బిజెపికి కేటాయిస్తే తాను రంగంలో ఉంటానని ఆమె చెబుతున్నారు.

——–

ప్రముఖ విద్యా సంస్థల అధినేత కే వి సుబ్బారెడ్డి కూడా నంద్యాల ఎంపీ టికెట్ కు ప్రత్నిస్తున్నట్టు తెలిసింది.

మొత్తం మీద కీలకమైన నంద్యాల ఎంపీ అభ్యర్థి కోసం టీడీపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. స్పష్టత వచ్చేందుకు ఇంకో వారం రోజులు పట్టొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top