పారిపోయిన దొంగ – చందమామ కథలు

The escaped theif - chandamama kathalu

వీధి తలుపు చప్పుడుకావటంతో వంటగదిలోవున్న రమ వచ్చి తలుపుతీసింది. ఆసరికే బాగా చీకటిపడింది. అవతలవున్న మనిషి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి చప్పున తలుపుమూసి “అరిచావంటే పీక నులిమేస్తాను. అన్నింటికీ తెగించాను. ఖైదులోంచి పారిపోయి వస్తున్నాను” అన్నాడు కరకుగా.
వీదిలో నలుగురు మనుషులు పరిగెత్తిన శబ్దం అయ్యింది. వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షకభటులు.వాళ్లను దూరంకానిచ్చి రమ నవ్వుతూ “చెరసాలలో సుఖంగా కాలం గడపక ఏం బావుకుందామని పారిపోయి వచ్చావు?” అని దొంగను అడిగింది. దొంగ కోపంగా “ఆ విషయం నీకు అనవసరం. ఇంట్లో ఇంకా ఎవరు వున్నారు?” అని అడిగాడు. “నీకేమీ భయంలేదు. నేను ఒంటరిగానే వున్నాను. వంట సగం అయ్యింది. వంట గదిలోకి వస్తావా?” అంటూ దారితీసింది రమ. దొంగ ఆమె వెనుకనే వంటగదిలోకి వెళ్ళి ఆమె వేసిన పీఠ మీద కూర్చున్నాడు. రమ వంకాయలు తరుగుతూ కళ్ళనీళ్లు పెట్టుకుని కొంగుతో తుడుచుకున్నది.

“నేను నిన్ను ఏమీ చేయలేదే? ఎందుకాకన్నీళ్లు?” అని దొంగ అడిగాడు. “నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు. వాడు ఆవేశంగా ఎవర్నో కొట్టి ఖైదు అయ్యాడు. అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు. వచ్చిన క్షణంనుంచి వాడికి శాంతిలేదు, నిద్రలేదు! అన్న హితవు లేదు! ఇల్లు కదలాలంటే భయం! బయట ఏ చప్పుడు వినిపించినా రక్షకభటులు వస్తున్నారని భయం! పిచ్చివాడిలా తయారయ్యాడు. శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాంటి భయాలు వుండవు. ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చును. ఆ మాట నేను చెప్పాను. వాడు వినలేదు. పదిరోజులపాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు. పదోరోజు రాత్రి హఠాత్తుగా రక్షకభటులు వచ్చారు. భయంతో ఆలోచించకుండా మేడమీదినుంచి దూకేసి దెబ్బలు తగిలి రెండురోజుల అనంతరం చచ్చిపోయాడు” అంటూ రమ కథ ముగించింది. దొంగ ఆమెను చూసి జాలిపడుతూ “గొంతు తగ్గించు, ఎవరైనా రాగలరు” అన్నాడు. “వంట అయ్యింది. భోజనం చేస్తావా?” అన్నది రమ.
దొంగకు తినాలనేవున్నది కాని సందేహించాడు.

“ఇందులో విషం కలపలేదులే. నీ ఎదటేగా వంటచేశాను?” అంటూ రమ దొంగముందు అన్నం, కూరలు వడ్డించింది. వాడు భోజనం చేస్తుంటే రమ “చూడబోతే మంచివాడివిలాగున్నావు. చెరసాలలో ఎలా పడ్డావు?” అని అడిగింది. దొంగ యిలా చెప్పాడు.. “నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఒక అవ్వ నన్ను పెంచి పెద్దచేసింది. నన్ను గారాబంగా పెంచటానికి తాను అష్టకష్టాలూ పడింది. ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు చదువులేదు.

పని దొరకలేదని దొంగతనం

మా పల్లెలో పనిలేక పట్నం వచ్చాను. ఏ పనీ ఇచ్చినవారు లేరు. నాలుగురోజులు తిండి లేదు. ఆకలి బాధకు తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలోవున్న సంచి లాక్కొని పారిపోతూ పట్టుబడ్డాను. రెండునెలలు శిక్షపడింది”. “అలాగా పాపం! మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు?” అని రమ అతణ్ణి అడిగింది. “అక్కడ అడ్డమైన చాకిరీ చేయాలి. పెద్ద ఎత్తున వంటలు చేయాలి. తోటపని చేయాలి. బట్టలు పిండాలి. చాపలు, దుప్పట్లు నేయాలి. బట్టలు కుట్టాలి.. ఎన్నోరకాల పనులు అవన్నీ చేసే ఓపిక నాకు లేదు” అన్నాడు దొంగ విసుక్కుంటూ. రమ నవ్వి “బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్లావు. అక్కడ పని ఎక్కువ అని దొంగతనంగా పారిపోయి వచ్చావు! ఇప్పుడేమి చేస్తావు?” అని అడిగింది. దొంగ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు.

also read తరంగిణి తెలివి – చందమామ కథలు

రమ మళ్లీ ఇలా అన్నది…“ఇప్పటినుంచీ నీకు నరకబాధలు ప్రారంభమవుతాయి. నిద్రాహారాలు వుండవు. భయం నిన్ను నీడలా అంటిపెట్టుకుని వుంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీకిప్పుడు జైలులోవున్న స్వేచ్ఛకూడా లేదు. పారిపోయి వచ్చి నీ ఖైదు శిక్షను పెంచుకున్నావు. అంతే! ఆ చెరసాలలోనే ఏ వంటలు చేయడంలోనో, బట్టలు కుట్టడంలోనో, దుప్పట్లు నేయడంలోనో, తోటపనిలోనో ప్రావీణ్యం సంపాదించివుంటే విడుదలై వచ్చాక నీ బతుకు నువ్వు స్వతంత్రంగా, గౌరవంగా బతికే మార్గం దొరికేది. అక్కడ నీకు శిక్షతో పాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది. నువ్వు చాలా తెలివితక్కువ పని చేశావు. పారిపోయి వచ్చావు.” దొంగకు కళ్లు తెరుచుకున్నాయి. అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు. “నిజమే! పొరపాటు జరిగిపోయింది. దీన్ని దిద్దుకోవడమెలాగా?” అని అతను రమను అడిగాడు. “మించిపోయిందేమీ లేదు. నీఅంతట నువ్వే చెరసాలకు వెళ్లి పట్టుబడు.

అలాచేస్తే నిన్ను దండించరు. కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు. పని నేర్చుకోవడానికి అదీ మంచిదే!” అన్నది రమ.
దొంగ సంతోషంగా, “సొంత చెల్లెలులాగా మంచి సలహా చెప్పావు. నీ రుణం తీర్చుకోలేను, వస్తా!” అని వెళ్లిపోయాడు. దొంగ వెళ్లిన కొంత సేపటికి మళ్లీ తలుపు చప్పుడు వినిపించింది. ఈసారి వచ్చినవాడు రమ తండ్రి. “ఎప్పుడూలేందీ ఇంత ఆలస్యం అయ్యిందేం నాన్నా?” అని రమ తండ్రిని అడిగింది. “చెరసాల నుంచి ఒక దొంగ పారిపోయాడు.

ఆ భయం నీకు వద్దు

అందుకే ఆలస్యమయ్యింది అన్నాడు తండ్రి. ఆయన చెరసాల అధికారి.
“మీరు ఖైదీలను చూసే తీరు అలావుంటుంది. చెరసాలను కేవలం ఖైదీలను శిక్షించటానికే కాదు. వాళ్లలో పరివర్తన కలిగించేవిగా కూడా వుండాలి. నీ చెరసాల నుంచి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు. నేను ఆ దొంగలోవున్న దొంగను పారదోలాను. అందుకోసం లేని ఒక అన్నయ్యను కూడా కల్పించాను” అంటూ రమ జరిగినదంతా చెప్పింది. “భేష్! చెరసాల అధికారి కూతురివి అనిపించుకున్నావు. అతను చెరసాల చేరాడో లేదో చూసి వస్తాను” అంటూ ఆయన లేచాడు. “ఆ భయం నీకు వద్దు. చెప్పానుగా? అతనిలో దొంగ పారిపోయాడు. భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు నువ్వు” అన్నది రమ.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top