11 మంది రాజ్యసభ ఎంపిలపై సస్పెన్షన్ రద్దు
న్యూఢిల్లీ : 11 మంది రాజ్యసభ ఎంపిల సస్పెన్షన్ మంగళవారం రద్దైంది. మోడీ ప్రభుత్వ చివరి పార్లమెంటు (బడ్జెట్) సమావేశాలు బుధవారం నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టడంతో ( రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు) సుమారు 146 మందిపై గతనెల శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ సస్పెండ్ సస్పెండ్ వేటు వేసింది.
146 మందిలో 136 మంది మిగిలిన సెషన్‌లలో సస్పెండయ్యారు. సెషన్ ముగియగానే వారి సస్పెన్షన్ రద్దైంది. మిగిలిన 14 మంది ఎంపిల (11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ సభ్యులు) కేసును ప్రత్యేక హక్కుల సంఘానికి సమర్పించింది. జనవరి 12న లోక్‌సభ ప్రత్యేక హక్కుల సంఘం ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మిగిలిన 11 మంది రాజ్యసభ ఎంపిల సస్పెన్షన్‌ను నేడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
లోక్‌సభ చివరి సమావేశాలు జనవరి 31న ప్రారంభమై .. ఫిబ్రవరి 9న ముగియనున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవే చివరి పార్లమెంటు సమావేశాలు కావడం గమనార్హం.