శివనామ స్మరణతో నలమల శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. శ్రీశైల భ్రమరాంభిక, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు మండుటెండలను సైతంలెక్కచేయకుండ కొండలను, గుట్టలను దాటుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. శివదీక్ష చేపట్టిన స్వాములతో పాటు సామాన్య భక్తులు పాదయాత్ర చేస్తూ శ్రీశైల మహా క్షేత్రానికి తరలివెళ్తూన్నారు. నలమలలో ఎక్కడచూసినా శివభక్తుల సందడి కనిపిస్తుంది. హరహర మహాదేవ శంభోశంకర అంటూ నినదిస్తూ మల్లన్న సన్నిధికి చేరుకుంటున్న భక్తులపై ప్రత్యేక కథనం …
పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జలజలపారే జలపాతాలు, పక్షుల కిలకిల రావాలు నల్లమల అడవుల సొంతం. శ్రీశైలం మహా క్షేత్రం ఎన్నో ఆలయాలకు, దేవతా మూర్తులకు పుణ్యతీర్థాలకు నిలయం. సహజ సౌందర్యంతో అలా రారే ఈ ప్రదేశాలన్నీ శ్రీశైల ప్రభావానికి ప్రతీకలు. మన పురాణాలు, ఇతిహాసాలు, ప్రాచీన కావ్యాలు, చారిత్రక శాసనాలు మొదలైనవన్నీ ఈ ప్రదేశాలను ఎంతగానో ప్రస్తావించాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివ భక్తుల పాదయాత్రతో నలమలలో అధ్యాత్మిక చింతన ఉట్టిపడుతుంది. ఎటుచూసిన శివమయం , ఓం హరోం హరా శంభో శంకర.. ఓం నమశ్శివాయ అనే శివనామస్మరణతో నల్లమల గిరులు మారు మోగుతున్నాయి. తమ ఇష్టాదైవాలైన శ్రీ భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు అడవులగుండా వేలమంది శివభక్తులు తరలివస్తున్నారు.

నంద్యాలజిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెంకటాపురం గ్రామం నుంచి సుమారు 46కిమీ నడకదారిలో శివమాలదారులు, భక్తులు మల్లన్న సన్నిధికి చేరుకుంటున్నారు. వెంకటాపురం నుంచి అటవీ మార్గాన పాదయాత్రికులు గో సాయికట్ట, వీరాంజనేయ స్వామి గుడి,నాగలూటి వీరభద్రాలయం, దామెర్లకుంట, పెచ్చెరువు, మఠం బావి, భీమునికొలను మీదుగా కైలాస ద్వారం చేరుకుంటారు. అక్కడి నుంచి హటకేశ్వరం సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం చేరుకొని మల్లన్న స్వామి ని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
నల్లమల్ల అటవి ప్రాంతంలో నడకదారుల్లో సాధారణంగా వెళ్లాలంటే చాలా కష్టం.అయినప్పటికి దేవదేవునిపై ఉన్న భక్తితో చిన్నా పెద్ద అని తేడా లేకుండా చాలా మంది భక్తులు పాదయాత్ర చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు .
శ్రీశైల మల్లన్న క్షేత్ర పాలకుడైన నాగలూటి వీరభద్ర స్వామిని దర్శించుకున్న తరువాతనే భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు . ఎంతో పవిత్రమైన ,పురాతనమైన దేవాలయం ఈ వీరభద్ర స్వామి ఆలయమని ఈ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి పోతాయని ,అనారోగ్యం నుండి దూరమై ఆరోగ్యంగా జీవిస్తారని ,ఉద్యోగ వ్యాపార రంగాలకు చెందిన వారికి అంత మంచి జరుగతుంది కాబట్టి అంత మహిమగల క్షేత్ర పాలకుడు కి భక్తులు మొక్కలు తీర్చు కుంటారు .
మార్గమధ్యలో స్వచ్చంద సేవాసంస్థలు ఏర్పాటు చేసిన షెడ్లు, చెట్లకింద సేద తీరుతూ శివ భక్తులు పాదయాత్ర గా శ్రీశైలంకు చేరుకుంటున్నారు. అక్కడక్కడ దాతలు అన్నదాన కార్యక్రమా లు ఏర్పాట్లు చేశారు.ఇలా పాదయాత్ర చేస్తూ శ్రీశైల మల్లన్న ను దర్శించుకోవడం తమకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందని భక్తులు చెబుతున్నారు .మరి కొందరు అయితే ప్రతి యేటా మహాశివరాత్రి ఇక్కడికి వస్తుంటాము ఇక్కడికి రావడం వలన తమ కష్టాలు అంతా తీరుతాయా ని నమ్ముతాము కాబట్టి దూర ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నామని భక్తులు చెబుతున్నారు ..
పన్నెండుజ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి, పద్దెనిమిది మహాశక్తులలో ఒకరైన శ్రీ భ్రమరాంబా దేవి వారికి నిలయమైన శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్రంలో లక్షలకొలది దానమిచ్చినా, రెండు వేలసార్లు గంగా స్నానం చేసినా, నర్మదా నది తీరంలో బహుకాలం తపస్సు ఆచరించినా, కాశి క్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహా పుణ్యం శ్రీశైల మల్లికార్జునస్వామిని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది. శిఖర దర్శన మాత్రాన అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి, పునర్జన్మ నుండి విముక్తి కలిగించే ఈ క్షేత్రాన్ని దర్శించడం బహుజన్మల పుణ్యఫలం. అలాంటి ఈ మహా క్షేత్రంలో ఈనెల 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీ భ్రమరాంబ దేవి వారికి ప్రత్యేక పూజలు, సాయంకాలం వాహన సేవలు,మహాశివరాత్రి నాడు శ్రీ స్వామివారికి లింగోద్భావ కాల మహా రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం, మరునాడు రథోత్సవం జరగనున్నాయి.ఈ ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం అధికారులు ప్రతిరోజు పలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.కాగా పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ సైతం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీశైల మహా క్షేత్రంలో ప్రతి అంగుళం పవిత్రమైందే. ఈ క్షేత్ర సందర్శనం బహుజన్మల సంచిత పుణ్యఫలం. అతి విశాలమైన ఈ క్షేత్రంలోఏ అంచున కాలు మోపిన ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. వేల సంఖ్యలో అనుబంధ క్షేత్రాలు ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో నిత్యం భక్తుల సందర్శనానికి నేటి కాలంలో అనువైనవి కొన్ని మాత్రమే. వాటిలో శ్రీశైలంలోని ప్రధానాలయానికి చేరువలో ఉండి ఏ రోజైనా ఎప్పుడైనా సందర్శించడానికి వీలైన శిఖరేశ్వరం, హటకేశ్వరం, సాక్షి గణపతి, పాలధార పంచదారలను సందర్శించవచ్చు.
శ్రీశైలంకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని కావాల్సిన ఏర్పాట్లను పకడ్భందీగా చేసామని దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు తెలిపారు .. భక్తులకు త్రాగు నీటి సౌకర్యం ,అత్యవసర వైద్య సేవలు ఏర్పాటు చేశామని వివరించారు.. భక్తుల తాకిడి ఎక్కువ గా ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బందులు కలుగకుండా చేస్తున్నామని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు …











