19-10-2025
నాపరతి గనుల్లో రాయల్టీ ఆపాలి.
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని నాపరతి గనుల్లో ప్రభుత్వం వసూలు చేస్తున్న రాయల్టీనీ వెంటనే ఆపాలని, నాపరతి గనుల్లో పనిచేస్తున్న నిరుపేద గని కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం నాగలూటి గ్రామంలో దామగట్ల, బ్రాహ్మణ కొట్కూరు, మిడ్తూరు, పీరసరావుపేట, నాగలూటి తదితర గ్రామాల నాపరతి గని కార్మికుల విసృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి రెడ్డి మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని గని కార్మికుల నుంచి గనుల శాఖ రాయల్టీ వసూలు చేయడం అన్యాయమన్నారు. నాపరతి గనుల్లో పనిచేసే కార్మికులకు ప్రభుత్వమే ప్రత్యేక రాయితీ ఇచ్చి ఆదుకోవాల్చిందిపోయి, గని కార్మికుల నుంచే ప్రభుత్వం రాయల్టీ వసూలు చేయడం సరికాదన్నారు. రాయల్టీ కారణంగా నాగలుటి ప్రాంతంలో నాపరతి గనులు మూతపడితే నందికొట్కూరు నియోజకవర్గంలో వందలాది గని కార్మికుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడాల్చి వస్తుందని, మీ కష్టం, నష్టం, మీకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గనుల శాఖ, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికీ తాను తీసుకెళ్లుతానని, మీకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి నాగలూటి గని కార్మికులకు హామీ ఇచ్చారు.











