పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష
మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని ఆదేశం
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
ఇటీవల 25వేల కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులను ప్రశంసించిన హోంమంత్రి
ఆంద్రప్రదేశ్ లో ఇటీవల మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, వారిపై మునుపెన్నడూ లేని విధంగా ఖఠిన ఉంటాయని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత అధ్యక్షతన శనివారం నాడు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగల పూడి అనిత మాట్లాడుతూ.. మహిళలు అదృశ్య మైన కేసులలో గాలింపు చర్యలపై వేగం పెంచి ఎటువంటి అఘాయిత్యం జరగముందే నిందితులని పట్టుకోవడంపై పోలీస్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్
ఇలాంటి కేసులలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లు, కోర్టుల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేసు నమోదైన తర్వాత ఛార్జీషీట్లు వేయడం, నిందితుల అరెస్ట్ లలో జాప్యం , రేకమెండిషన్ లకు తావు లేకుండా చేసి నేరాలను నియంత్రించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇకపై చిన్నారులు, మహిళలకు సంబంధించిన సున్నితమైన కేసులలో ఎప్పటికప్పుడు సమీక్ష చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బృందం అక్రమంగా రవాణా చేస్తున్న 25,251 కేజీల గంజాయిని పట్టుకోవడాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి ప్రశంసించారు. ఈ కేసులో 373 వాహనాలను స్వాధీనపరచుకోవడం, 2,237 మంది నిందితులను గుర్తించడంలో కృషిని మెచ్చుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా వ్యవహరించే వారికి సందేశమిచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సోషల్ మీడియా వేదికగా పేట్రేగిపోతున్న చీడపురుగుల్లా వ్యవహరించే వారికి బుద్ధిచెప్పేలా కూటమి ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం దిశగా చిత్తశుద్ధితో ముందుకెళుతోందన్నారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ప్రజల ఆశలకు అనుగుణంగా పని చేయడంలో పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హోంమంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాలలో సీసీ కెమెరాలకు సంబంధించి డ్రైవ్ చేపట్టాలన్నారు. హోంమంత్రి ఆదేశాల ప్రకారం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిబద్ధతతో వ్యవహరించనున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ లడ్డా, సీఐడీ ఏడీజీ రవిశంకర్, యాంటీ నార్కోటిక్ చీఫ్ ఆకే రవికృష్ణ, లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్ సహా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.