నూనె గింజలతో పాటు ఆయిల్పామ్ సాగుని ప్రోత్సహించటానికి జాతీయ మిషన్ ఏర్పడింది. పూర్తిగా నీటి వసతితో జరిగే సాగు వల్ల ఆయిల్ పామ్ దిగుబడులు ఎక్కువగా ఉంటున్నాయి. కాని ఖర్చులు కూడా ఎక్కువ. సంవత్సరంలో పది నెలల పాటు వర్షాలు కురిసే ఇండోనేసియా, మలేసియాలలో ఉత్పత్తి వ్యయం తక్కువ. ఆదేశాలతో పోటీ పడాలంటే మన దేశంలో ఆయిల్ పామ్ రైతులకు దిగుమతి సుంకాల రక్షణ అవసరం. హెక్టారుకి నాలుగైదు టన్నుల పామ్ అయిల్ ఉత్పత్తవుతున్నది. సాంప్రదాయ నూనెగింజల దిగుబడికి ఇది ఐదారు రెట్లు ఎక్కువ. ప్రస్తుతం 3.75 లక్షల హెక్టార్లుగా ఉన్న ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని 2029-30 కల్లా 8.5 లక్షల హెక్టార్లకు పెంచాలని జాతీయ మిషన్ లక్ష్యంగా పెట్టుకున్నది.
ప్రస్తుతం ఐదు లక్షల టన్నులుగా ఉన్న క్రూడ్ పాక్ఆయిల్ ఉత్పత్తిని 28 లక్షల టన్నులకు పెంచాలనే లక్ష్యాన్ని సాధించాలంటే విధాన మద్దతు అవసరం. అంతర్జాతీయ మార్కెట్లో పామ్ ఆయిల్ ధర టన్నుకి రెండువేల డాలర్లను తాకినప్పుడు మన దేశంలో రైతులకు పామ్ ఆయిల్ పండ్ల గెలలకు టన్నుకి 24 వేల రూపాయల ధర లభించింది. ఇప్పుడది 13 వేల 900 రూపాయలకు పడిపోయింది. తాజాగా విధించిన దిగుమతి సుంకాల వల్ల 16 వేలరూపాయల పైగానే కంపెనీలు రైతులకు చెల్లించే అవకాశముంది. ఆయిల్ సీడ్, ఆయిల్ పామ్ జాతీయ మిషన్ ఒక ‘వయబిలిటీగాప్ ఫండింగ్’ విధానాన్ని ప్రకటించింది. కాని అందుకు ప్రాతిపదికగా ఐదు సంవత్సరాల సగటు అంతర్జాతీయ ధరను తీసుకొని అందులో 16 శాతాన్ని పామ్ అయిల్ పండ్ల గెలలకు ఇవ్వాలని సూచించింది.
Also Read దిగుమతి సుంకాల వల్ల నూనెగింజల ధరలు ఎంత పెరుగుతాయి?
కంపెనీలకు అందువల్ల కలిగే నష్టాలను జాతీయ మిషన్ నిధుల నుండి అందించాలి. ఈ విధానాన్ని సవరించి ఆయిల్ పామ్ రైతుల పండ్ల గెలలకు టన్నుకి 16 వేల రూపాయల కనీస మద్దతు ధరనందించాలి. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు కంపెనీలకు కలిగే నష్టాలను జాతీయ మిషన్ పూడ్చాలి. పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ని బట్టి రైతులకు ధరలు చెల్లించే విధానం వల్ల గతంలో రైతులు ఆయిల్ పామ్ తోటలను తీసివేసిన ఉదంతాన్ని మర్చిపోకూడదు. ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని స్థిరంగా పెంచాలంటే దిగుమతి సుంకాల విషయంలో స్పష్టమైన విధానముండాలి.
ఇతర నూనె గింజల ధరలు కనీస మద్దతు ధర
పామ్ అయిల్ అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వెంటనే దిగుమతి సుంకాలను పెంచాలి. అప్పుడు ప్రాసెసింగ్ కంపెనీలకు నష్టాలు రావు. జాతీయ మిషన్ అందించాల్సిన నష్టపరిహారం కూడా తగ్గుతుంది. అయితే వినిమయదారులు రిఫైన్డ్ పామ్ ఆయిల్ కిలోకి 150 రూపాయలు, సన్ఫ్లవర్ ఆయిల్ కిలోకి రూ.175 రూపాయలు, వేరుశనగ నూనె కిలోకు 220 రూపాయలు చెల్లించాలి. మన దేశం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెల్లో పామాయిల్ ఆయిల్ వాటానే సగానికన్నా ఎక్కువ. పామాయిల్ని దేశంలో అనేక విధాలుగా వాడుతున్నారు. పామాయిల్పై దిగుమతి సుంకాలతో పాటు సోయాచిక్కుడు, సన్ ఫ్లవర్ నూనెలపై మరో పది శాతం ఎక్కువగా దిగుమతి సుంకాలుండాలి.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ఈ విధానం వల్ల దేశీయంగా ఉత్పత్తవుతున్న నూనెగింజల ధరలు గిట్టుబాటుగా ఉండి. రైతులు విస్తీర్ణాన్ని, ఉత్పాదకతను పెంచే ప్రయత్నం చేస్తారు. దేశంలో తలసరి వంట నూనెల వాడకం అంతర్జాతీయ సగటుసమీపానికి చేరింది. వాటి ధరలను ఎక్కువగా ఉంచడం వల్ల సగటు వాడకం సంవత్సరానికి 15 కిలోలకు తగ్గినా అది ప్రజలకు ఆరోగ్యకరమే. తాజా ప్రభుత్వ నిర్ణయం వల్ల అయిల్పామ్ పండ్ల గెలలకు
టన్నుకి 16 వేల రూపాయలు ధర లభిస్తుందనీ, ఇతర నూనె గింజల ధరలు కనీస మద్దతు ధరల కన్నా ఎక్కువగా నిలుస్తాయనీ అశిద్దాము. దీర్ఘకాలంలో వంట నూనెల దిగుమతుల్ని తగ్గించాలనే లక్ష్య సాధనకు
స్థిరమైన విధానాలు అవసరం.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, 83098 59517, 70328 11608