మామిడి రైతును ఈ ఏడాది తెగుళ్లు కోలుకోని దెబ్బతీస్తున్నాయి. చెట్లకు వచ్చిన పూతను చూసి గంతులేసిన అన్నదాత ఆనందం అంతలోనే ఆవిరవుతోంది. విరబూసిన తోటలపై చెగుళ్లు విజృంభించ టంతో, పూత-పిందె దశకు చేరకుండానే రాలిపోతోంది. నివారణకు లెక్కకుమించి మందులు పిచి కారి చేస్తున్నా పూత నిలవటం లేదని అన్నదాత ఆందోళన చెందుతున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఒక్క సారిగా విరబూసిన మామిడి పూతతో అన్నదాత ముఖాల్లో ఆనందం విరబూసింది. అయితే వారంరోజుల వ్యవధిలోనే వచ్చిన పూత, వచ్చినట్టు వచ్చి రాలిపోతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాత కొట్టుమిట్టా డుతున్నారు.
గడిచిన ఐదేళ్లుగా మిర్చి పంటను దెబ్బతీస్తున్న నల్ల తామర ఈ ఏడాది మామిడిని ఆశించి తీవ్రంగా నష్టం చేస్తోంది. పూతలోకి చేరిన నల్లతామర పురుగులు రసం పీల్చటంతో, పిందె దశకు చేరకుండానే పూత రాలిపోతోంది. దీంతో పాటు తేనేమంచు తెగులు ఉదృతి ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా ఈ రోజు విరబూ సిన పూత వారంరోజుల వ్యవధిలో నల్లగా మాడిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీఏడాది ఒకటి, రెండుసార్లు మందులు పిచికారి చేస్తే సరిపోయేదని, ఈ ఏడాది ఇప్పటికి ఐదుసార్లు, రకరకాల మందులు పిచికారి చేసినా మార్పు కనిపిం చటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పిచికారికి ఎకరానికి 2 వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
వచ్చిన పూత వచ్చినట్టు దూసుకుపోవటంతో ఆ ప్రభావం దిగుబడులపై పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లతామర నివారణకు ఎసిఫేట్, పిప్రోనిల్ 25 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. తేనే మంచు పురుగు నివారణకు బ్యూపోఫె జిన్ 15 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పిందె దశలో ఉన్నపుడు క్లోరిపైరిఫాస్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయటం వల్ల టెంకి పురుగు అశించకుండా ఉంటుంది. మామిడి పండుకు ఈగ సోక కుండా ఈగ బుట్టలు, ఫ్రూట్ కవర్స్ వినియోగించాలని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.











