- బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:02.12.2025
- దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నిందితురాలు అరెస్టు
- 15 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం
- అరెస్టు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
ఇటీవల బాపట్ల జిల్లాలో పలుచోట్ల బస్టాండ్లలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నిందితురాలిని బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు అరెస్టు చేసి, ఆమె నుండి 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ముద్దాయి వివరాలు (అంతర్రాష్ట్ర నేరస్థురాలు)
కర్రేదుల @ కారేదుల @ కావటి లలిత @ లిల్లీ @ లల్లి @ గంటికోట పద్మ @ గండికోట పద్మ, W/o రవి, వయస్సు 41 సంవత్సరాలు, వైకుంటపురం , కావలి టౌన్, ఎస్.పీ.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా.
కేసులను చేదించిన విధానం, నిందితురాలి అరెస్ట్:
ఇటీవల కాలంలో జిల్లాలోని బస్టాండ్లలో మహిళా ప్రయాణికులను దృష్టి మరల్చి, వారి లగేజీలలో దాచుకున్న పర్సులు, బంగారు ఆభరణాలను దొంగిలించే కేసులు ఎక్కువ అవ్వడంతో వాటిని ఛేదించేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎమ్.డి. మోయిన్ పర్యవేక్షణలో, ఇంకొల్లు సీఐ వై.వి. రమణయ్య, ఇంకొల్లు ఎస్ఐ జి. సురేష్, పోలీస్ స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాల సమాచారం ఆధారంగా జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నిందితురాలిని ది:02.12.2025 న ఉదయం 11.00 గంటలకు ఇంకొల్లు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చాకచక్యంగా అరెస్టు చేశారు. ఆమెను విచారించగా బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట 1 టౌన్, కాకినాడ జిల్లాలోని తుని పోలీస్ స్టేషన్ ల పరిదిలలో ఇటీవల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించింది. మొత్తం 5 కేసులలో 15 లక్షల విలువ గల 136 గ్రాముల బంగారు ఆభరణాలను ఆమె నుండి స్వాదినం చేసుకోవడం జరిగింది.
నిందితురాలు నేరం చేయు విధానం:
నిందితురాలు పగటిపూట బస్టాండ్లు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్ళు మరియు వ్యాపార సముదాయాలలో, మహిళల వద్ద ఉన్న సంచులను గమనిస్తూ ఉంటుంది. పర్సులు, సంచులలో విలువైన వస్తువులను దాచుకున్న వారిని లక్ష్యంగా చేసుకొని వారి దృష్టి మరల్చి చాకచక్యంగా వాటిని దొంగిలించి ఎవరికి అనుమానం రాకుండా ప్రశాంతంగా ఆ ప్రదేశం నుండి బయటకు వస్తుంది.
నిందితురాలి నేర చరిత్ర:
నిందితురాలిపై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో బ్యాగ్ లిఫ్టింగ్ కేసులు ఉన్నాయి. గుంటూరు, కృష్ణ, విజయవాడ సిటీ, పశ్చిమ గోదావరి, ఎస్.పీ.ఎస్.ఆర్ నెల్లూరు, కర్నూలు, తిరుపతి, ప్రకాశం, YSR కడప ఇతర పలు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నేరాలకు పాల్పడింది. చివరిసారిగా 2020 సంవత్సరంలో వరంగల్ పోలీసులు అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఈమె పై గతంలో 17 కేసులున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14, తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులున్నాయి.
ప్రశంసలు:
బ్యాగ్ లిఫ్టింగ్ కేసులను సమర్ధవంతంగా చేదించి ముద్దాయిని అరెస్ట్ చేసి, దొంగిలించిన 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాదీనం చెయ్యడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇంకొల్లు సిఐ వై.వి.రమణయ్య, ఎస్ఐ జి.సురేష్, హెడ్ కానిస్టేబుల్ లు బి.అచ్చయ్య, జి.ప్రసాద్, కానిస్టేబుల్ లు సి.హెచ్ రత్నరాజు, ఎ. రామి రెడ్డి, బి. బాలచంద్ర, మహిళా కానిస్టేబుల్ ఆర్. నాగలక్ష్మి లను బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ. బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులను అందజేశారు.
ఈ సమావేశంలో చీరాల డీఎస్పీ ఎమ్.డి. మోయిన్, ఇంకొల్లు సీఐ వై.వి. రమణయ్య, ఇంకొల్లు ఎస్ఐ జి. సురేష్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



