EC: రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే: సీఈవో ఎంకే మీనా
అమరావతి: ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు..
సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచారంలో హెలికాప్టర్లు, వాహనాల వినియోగం, సభలు, సమావేశాలు, ఊరేగింపుల నిర్వహణకు ముందుగా తీసుకోవాల్సిన అనుమతుల వ్యవహారంపై సూచనలు చేశారు.
ప్రత్యేకించి ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే వ్యయంపై సూచనలిచ్చారు. పోలింగ్ ప్రక్రియతో పాటు కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీలు, వారి తరఫున ప్రతినిధులు అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నడుచుకోవాలన్నారు. మార్గదర్శకాలపై అవగాహన ఉంటే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సందేహాలకు, గందరగోళానికి తావుండదని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలను సీఈవో దృష్టికి తెచ్చాయి. ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యం, కొందరు ఉద్యోగులు పరిధి దాటి వ్యవహరిస్తోన్న అంశంపై తెదేపా, సీపీఎం పార్టీలు ఫిర్యాదు చేశాయి.