శ్రీ మాల మల్లేశ్వరస్వామి ఆలయం – బన్ని ఉత్సవం.
” దేవరగట్టు “ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. విజయదశమి నాడు మలే మల్లేశ్వరస్వామి సాక్షిగా కర్రల సమరం జరగడం ఇక్కడ సంప్రదాయం.
కళ్లలో భక్తి… కర్రల్లో పౌరుషం… వెరసి రక్తాభిషేకం..! అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం..!
దసరా అంటే దేశమంతా సంబరం. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం సమరం! ఒళ్లు విరుచుకునే వీరావేశం! పూనకంతో తలలు బద్దలు కొట్టుకునే ఆచారం.
విజయదశమి రోజున అర్ధరాత్రి దేవరగట్టు కొండల్లో ఉత్సవ మూర్తులను తీసుకెళ్లేందుకు 3 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు పోటీపడే దృశ్యమే దేవరగట్టు బన్నీ యాత్ర అంటారు.
దేవరగట్టు ఉత్సవాల్లో ప్రధానమైన ఘట్టం జైత్రయాత్రలో జరిగేది కర్రల సమరం కాదని.. కేవలం ఊరేగింపు మాత్రమేనని స్థానికులు చెబుతున్నారు.
కర్రలపై భాగాన రింగులు అమర్చుకుని శబ్దం చేసుకుంటూ ఊరేగింపులో పాల్గొంటారని..
భక్తి శ్రద్ధలతో జరిగే ఈ కార్యక్రమం కర్రలతో కొట్టుకునే కార్యక్రమంలా ప్రచారంలోకి వచ్చిందంటున్నారు.
పూర్వకాలం నుంచి ఇదే ఆచారం కొనసాగుతోందని.. కొట్టుకోవడం జరగదని.. కేవలం కొట్టుకున్నట్టు హడావిడి చేస్తూ… పెద్ద యుద్ధం జరుగుతున్న భావన కల్పించే ఆచార క్రీడ మాత్రమేనని అంటున్నారు అక్కడి స్థానికులు..
విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ ఉత్సవం ప్రారంభమైంది. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది.
పురాణాల ప్రకారం… ముక్కంటి.. ఇక్కడ మణి, మల్లాసుర అనే రాక్షసుల్ని కర్రలతో కొట్టినట్లు చెబుతారు. అందుకే స్థానికులు కూడా ఏటా దీన్ని విజయదశమి నాడు దీన్ని నిర్వహిస్తున్నారు.
దసరా రోజున అర్ధరాత్రి జరిగే ప్రధాన ఘట్టం జైత్రయాత్ర. దేవరగట్టు సమీప ప్రాంతాలకు కులదైవం మాళమల్లేశ్వరస్వామి.
కూర్మావతారంలో ఆయన్ని భక్తులు కొలుస్తారు. అయితే దసరా రోజున జరిగే ఉత్సవంతో ఉత్సవ విగ్రహాలను ఏ గ్రామానికి తీసుకెళ్తే ఆ ఊరికి మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే స్వామి విగ్రహాలను తీసుకెళ్లేందుకు ఇక్కడి చుట్టుపక్కల గ్రామస్తులు తరలివస్తారు. అదే కర్రల యుద్ధానికి దారితీస్తోంది. స్థానికులు దీనికి బన్నీ ఉత్సవంగా పేరు పెట్టుకున్నారు.
మండలంలోని నెరణికి, నెరణికి తాండా, కొత్తపల్లి, సులువాయి, విరుపాపురం, అరికేర, కురుకుంద, ముద్దనగేరి, ఆలూరు గ్రామాల ప్రజలు దేవరగట్టు ఉత్సవాల్లో పాల్గొంటారు.
దసరా రోజు రాత్రంతా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్ని ఉత్సవం, భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు. తలలు పగులుతుంటాయి నెత్తురు కారుతుంటుంది … గాయానికి భరణం ( దేవుని పసుపు ) అద్దుకుని పోరాడుతుంటారు… దేవుడిని దక్కించుకున్నాక ఆనందోత్సాహాలతో సంభ్రమాలు చేసుకుంటారు .. ప్రభుత్వం ఈ హింసాత్మక ఆచరణలు జరగకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది ..
ఉత్సవం జరుగుతుందిలా..
దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో మాత మాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగుతుంది.
భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి , పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది.
ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక..అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది.

మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారి చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశ పూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించేవారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు.
తమకు ఏమీ కాదనీ… ఆ పరమేశ్వరుడు తమను కాపాడుతాడని స్థానికులు బలంగా నమ్ముతున్నారు.