కోళ్ళకు వచ్చు అతిముఖ్యమైన వ్యాధులలో సి.ఆర్.డి వ్యాధి ఒకటీ. ఇది మైకోప్లాస్మాగాలిసెఫ్టికమ్ అనే బ్యాక్టీరియా క్రిమివలన వస్తుంది. చాలామంది రైతులకు ఈ వ్యాధి గురించి తెలుసు కాని ఈ వ్యాధి నియంత్రణలో విఫలమవుతూ అనేక ఆర్థిక నష్టములకు గురి అవుచున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కోళ్ళలో సి.ఆర్.డి క్రిమిలేని ప్రదేశం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధి లక్షణాలు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. కావున రైతులకు వారి ఫారంలో ఈ వ్యాధి ఉన్నట్లు వారికే తెలియదు.
ఈ వ్యాధి ఉధృతి అనేది రైతులు పాటించే యాజమాన్య పద్ధతులు, షెడ్లు నిర్మాణము, పారిశుద్ధ్యం, జీవసంరక్షణ, త్రాగునీటి నాణ్యతను బట్టి మరియు కోళ్ళలో వ్యాధినిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.
ఈ వ్యాధి సాధారణముగా ఇ-కోలి, ఆర్.డి., ఐ.బి., ఐ.ఎల్.టి మొదలగు వ్యాధులతో కలిపి జతగా వ్యాపించును. అప్పుడు దీనిని కాంప్లికేటెడ్ సి.ఆర్.డి అని అంటాము.
ఈ సందర్భములో వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉండి అధిక సంఖ్యలో మరణాలు, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గటంతో పాటు వ్యాధి చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుంది. కావున దీనిని ఖరీదైన వ్యాధిగా పిలుస్తాము. ఒక్క మాటలో కోళ్ళ రైతుల లాభాలను మింగేసే వ్యాధిగాను అనవచ్చును. కావున రైతులు ఈ వ్యాధిపై సమగ్ర అవగాహన ఏర్పరచుకొని నష్టనివారణ చర్యలు చేపట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది.
ఈ వ్యాధి కోళ్ళలో వ్యాప్తి చెందడానికి అనుకూలించే అంశాలు
కోళ్ళ పెంపకములో బ్రూడింగ్ దశ నుండి చివరి వరకు కోడి ఎప్పుడు ఒత్తిడికి గురయినా ఈ క్రిమి కోడిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. గాలి, వెలుతురు సరిగా ప్రసరించేటట్లు షెడ్లు నిర్మాణము లేనట్లయితే, వ్యాధి సోకిన ఫారంలోని పనిముట్లను ఇతర ఫారాల వారు వాడినట్లయితే, అలాగే వ్యాధిగ్రస్తమైన పేరెంటు కోళ్ళ నుండి తయారైన గుడ్ల ద్వారా వాటి పిల్లలకు ఈవ్యాధి కనిపిస్తుంది. అయితే వయస్సు పెరిగేకొద్ది వ్యాధికి లోనయ్యే అవకాశము తగ్గుతుంది. ఎక్కువ శాతము లేయర్ కోళ్ళల్లో అత్యధిక గ్రుడ్ల ఉత్పత్తి ఉన్నప్పుడు ఈ వ్యాధి కనిపిస్తుంది.
వ్యాధి లక్షణాలు : కళ్ళ వెంబడి నీరు కారటం, ముఖం వాపు, ముక్కు వెంబడి నీరు కారటము, గురక, పిల్లి కూతలు, మేత తినడము తగ్గడము, కోడి బరువు తగ్గటము, గ్రుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల మరియు మరణాలు 30 శాతము వరకు ఉండును.
వ్యాధిని గుర్తించడము ఎలా ? కోళ్ళలో వ్యాధి లక్షణాలు గమనించటము ద్వారా మరణించిన కోడిన శవ పరీక్ష చేయడము ద్వారా వ్యాధిని గుర్తించవచ్చును. శ్వాసనాళంలో తెమడ, ఎర్రగా కమిలి ఉండటం, గాలి గదులు దళసరిగా మారి, వాటిలో తెలుపు నుండి పసుపు పచ్చటి పదార్దము ఉండడము, ఊపిరితిత్తులు కమిలిపోవడము కనిపిస్తాయి.
గుండె, కార్జము, పొట్ట ప్రేగులపైన తెల్లటిపొర ఏర్పడటము గమనించవచ్చును. కాంప్లికేటెడ్ సి.ఆర్.డి అయితే లక్షణాలు మరింత తీవ్రముగా కనిపిస్తాయి. కావున చనిపోయిన కోళ్ళను ప్రయోగశాలకు తీసుకొని వెళ్ళి పశువైద్యునికి చూపించి రోగనిర్ధారణ చేయవలెను.
వ్యాధి చికిత్స :
చికిత్స ప్రారంభించే ముందు ఈ వ్యాధికి చెందిన క్రిములతో పాటు ఇతర వ్యాధి కారకాలు ఏయేమి వున్నాయో ముందుగా గుర్తించాలి. క్రిమి మీద పనిచేయటానికి టైలోసిన్, లింకోమైసిన్, ఎజిత్రోమైసిన్ మందులు వాడుకోవచ్చును. అయితే సి.ఆర్.డి క్రిమితో పాటు, జతగలిసిన ఇతర క్రిములపై పనిచేసే యాంటీ బయాటిక్స్ మందులను కలిపి వాడుకోవలసి ఉంటుంది. మందులు ఎంత మోతాదులో వాడాలి, ఎన్నివారాలు వాడాలి అనేది షెడ్లో ఉన్న వ్యాధి ఉధృతిని బట్టి పశువైద్యుల సలహాపై వాడవలసి ఉంటుంది.
Also Read దిగుమతి సుంకాల వల్ల నూనెగింజల ధరలు ఎంత పెరుగుతాయి?
వ్యాధి నివారణ: ఈ వ్యాధిని పూర్తిగా నివారించడము సాధ్యం కాదు. కాని వ్యాధి నియంత్రణలో ఉంచుకోవాలి. హేచరీలలో గ్రుడ్లను పొదగడానికి ముందు జెంటామైసిన్ మొదలగు మందులలో ముంచాలి. పారిశుద్ధ్యం, జీవసంరక్షణ సక్రమంగా పాటించే హేచరీల నుండి కోడిపిల్లలను కొనుగోలు చేయాలి. సి.ఆర్.డి క్రిమిబ్రూడింగ్ దశలో కోడిలోకి ప్రవేశిస్తుంది. కావున మొదటిరోజు నుండి సి. ఆర్.డి నివారణ మందులను వాడడము మొదలు పెట్టాలి. బ్యాచ్కు బ్యాచ్కు మధ్య పారిశుద్ధ్యపు చర్యలు సక్రమంగా నిర్వహించాలి. నేలను, మెష్ను, కేజెస్ను ఫ్లేమ్గన్తో కాల్చాలి. బ్రూడర్లు, గోనెసంచులు, మేత తొట్టెలు, నీటి గిన్నెలు క్రిమినాశక ద్రావణాలతో కడగాలి. షెడ్లలో అమ్మోనియా వాసనలు లేకుండా చూడాలి.
షెడ్ల పక్కన గాలి ప్రసారాలను నిరోధించే చెట్లు ఉండకూడదు. కోళ్ళకు మంచి నాణ్యమైన తాగునీరు, మేతలో టాక్సిన్ లేని మంచి నాణ్యమైన దాణాను ఇవ్వాలి. కోళ్ళను సాధ్యమైనంత ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. సి.ఆర్. నివారణ మందులు ఖరీదైనవి. అయినప్పటికీ వీటిని వాడటము వలన అధిక గుడ్ల ఉత్పత్తి, అధిక మేత వినియోగము తక్కువ మరణాల శాతము ఉండడము మనం గమనించవచ్చు. వ్యాధి నివారణ మందులు వాడుతూ బ్రూడింగ్ గ్రోయర్ దశలలో క్రిమిసంంహారక, పారిశుధ్య, జీవరక్షణ చర్యలు సక్రమముగా నిర్వహించినట్లయితే ఈ వ్యాధిని నివారించవచ్చు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
డా. టి. చంద్రావతి (9440579895), డా. యమ్. జీవనలత (8247297725), పశువైద్యకళాశాల, మామునూరు, వరంగల్