బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా బిసి కులాల జనగణన నిర్వహించాలి

pm-modi.jpg
బీసీలకు అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజకీయ రంగంలో దామాషా పద్దతిలో సరైన వాటా కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించడానికి బిసిలు సిద్ధం కావాలి

 దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఆధిపత్య కులాల యాజమాన్యంలోనే నడుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఆయా పార్టీల్లో బీసీలకు కొంత మేర అవకాశాలు కల్పిస్తున్నారంటే కేవలం ఓటు బ్యాంక్ కోసం మాత్రమే. అంతేగాక అవకాశాలు కల్పించిన వారందరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని చంపుకుని, తమ కనుసన్నులలో మెదులుతూ రాజకీయ బానిసత్వములో మునిగి తేలే వారే. తమ బంధువుల కోసం, వారసుల కోసం, స్వార్థ ప్రయోజనాలకు  స్వలాభాలకు జాతి ప్రయోజనాలను తాకట్టు  పెడుతున్నారు. ఆస్తులను కూడబెట్టడం, కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోవడం, పదవుల గాలానికి ఎరలై ఆత్మగౌరవానికి మసి పూసి మోకరిల్లుతున్నారు. సామాజికంగా ఆధిపత్య కులాల కంటే వాళ్లకు బానిసలై  రాజకీయ పబ్బం గడుపుకునే బీసీ నాయకులతోనే పెను ప్రమాదం పొంచి వుంది. వీరి పట్ల బహుజన సమాజం అప్రమత్తంగా  ఉండాల్సిన అవసరముంది.

బీహార్ లో బిజెపి ఎన్ని రకాల ఆటంకాలు పెట్టిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ లు ఇద్దరు బిసిలు కావడం వల్లనే బిసి కులాల జనగణన సాధ్యమైందని అవగతం చేసుకోవాలి.
అదేవిధంగా తమిళనాడులో అగ్రకులాలకు 10% రిజర్వేషన్ లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న సందర్భములో ముఖ్యమంత్రి స్టాలిన్ రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని సాహసోపేతంగా అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇది ఒక ముఖ్యమంత్రి బిసి బిడ్డ కావడం వల్లనే సాధ్యమైందనే విషయాన్ని గమనించాలి.

  కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బిసి కులాల జనగణన జరపాలని పార్లమెంట్ లో ఆందోళన చేసిన బిజెపి పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బిసి కులాల జనగణన జరపమంటే గౌరవ ప్రధాన మంత్రి మోదీ గారు బిసి కులాల జనగణన జరిపితే దేశం కులాల వారిగా విడిపోతుందని దేశ భక్తి పేర తమ దమన నీతిని ప్రదర్శిస్తున్నారు. 

దేశములో మొట్ట మొదటి సారి 1881లో జనగణన సర్వే జరిగింది. ఆ తర్వాత 1931లో డా.అంబేడ్కర్, జశ్వంత్ రావు (సత్యశోధక్ సమాజ్ ప్రధాన కార్యదర్శి) గార్ల విన్నపముతో బ్రిటిష్ ప్రభుత్వము రెండవసారి బిసి కులాల జనగణన సర్వే జరిపింది. అప్పటి సర్వే ప్రకారం బిసి జనాభా 52% అని తేలింది. ఈ 92 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా బిసి కులాల జనగణన సర్వే జరుపలేదు, జరిపే ప్రయత్నం చేయలేదు.

బీసీల జన గణన సంగతి అట్లుంటే బీసీ కమీషన్ల సంగతి చూద్దాం. బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్‌ కమిషన్‌ను నియమించగా, 1955 మార్చిలో కమిషన్‌ నివేదిక సమర్పించింది. అప్పటి ప్రభుత్వం నివేదికను ఖాతరు చేయకుండా బుట్టదాఖలు చేసింది. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త కమిషన్‌ను 1978 డిసెంబర్‌లో నియమించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వరి ప్రసాద్ మండల్‌ సారధ్యంలో మండల్ కమీషన్ ను నియమించింది. అదే “మండల్ కమీషన్”.  ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం. కుల వివక్షతను తొలగించేందుకు, వెనుకబాటు తనాన్ని తగ్గించేందుకు రిజర్వేషన్లను ఏర్పరిచడమనే లక్ష్యాన్ని 11 సూచికలను ఆధారంగా తీసుకోవడమైనది. మండల్ కమీషన్ కులం, ఆర్థిక, సామాజికత పారామితులను ఆధారం చేసుకుని మండల్‌ కమీషన్ 1980 డిసెంబర్‌ 31న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అప్పటికి జనతా ప్రభుత్వం పోయి ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కమీషన్ సూచనలు అమలుకు నోచుకోలేక మండల్ నివేదిక బుట్ట దాఖలు పాలైంది. ఆ తర్వాత 10సంవత్సరాలకు బీసీలలో చైతన్యం రగిలి మండల్ కమీషన్ అమలుకు ఉద్యమించారు. అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ 1990 ఆగస్టు 7న మండల్‌ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్‌ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. దేశమంతటా నిరసన జ్వాలలు లేపి మండల్ కమీషన్ ను మంటకలిపెందుకు ప్రయత్నించాయి. జనతాదళ్ తో బహుజన్‌ సమాజ్‌ పార్టీ మాత్రమే ఉద్యమానికి అండగా నిలిచింది. బయట నుండి వీపీ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ కపట బుద్ధితో తన మద్దతును ఉపసంహరించుకుంది.మండల్‌ కమిషన్‌ను అమలు చేయరాదని ఆధిపత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు మూడు సంవత్సరాల కోర్టు స్టే అనంతరం 1993లో మండల్‌ కమీషన్ అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో, పబ్లిక్ సెక్టార్ సంస్థలలో మాత్రమే 27% రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్‌ సౌకర్యం పొందే బీసీలను “ఇతర వెనుకడిన తరగతులు” (ఓబీసీ)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్‌ కమిషన్‌ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

ప్రస్తుతం దేశములో బీసీల జనాభా  దాదాపు 63% చేరుకుంది. దామాషా పద్దతిలో రిజర్వేషన్ అమలు చెయ్యాలంటే పట్టించుకొనే పార్టీ లేదు, నాయకుడు లేడు. కానీ 12% ఆధిపత్య కులాలకు మాత్రం 10% EWS రిజర్వేషన్ కల్పించింది. కానీ  63% ఉన్న బిసిలకు మొండి చెయ్యి చూపింది.

 అంటే దేశములో ఉండే ఏ ప్రధాన పార్టీలైన అగ్ర కులాల ఆధిపత్యంలో నడిచేవే.  మండల్ కమీషన్ ను అమలు చేయడములో చిత్త శుద్ది లేనివే. 

బహుజన మిత్రులారా … దేశములో అత్యధిక భాగమైన బిసిలకు దామాషా పద్దతిలో రాజకీయ రిజర్వేషన్లు కావాలి, రాజ్యాధికారం కావాలి. పార్టీల పేరుతో విడిపోయిన సామాజిక ఆత్మ గౌరవం కోసం ఒక్కటవుదాం. ఇప్పటికైనా మన బీసీ సమాజం మొద్దు నిద్ర నుండి మేలుకొందాం, ‘సోయి’ తెచ్చుకొని సామాజిక న్యాయం కోసం ఉద్యమిద్దాం, సమ సమాజ స్థాపన కొరకు అడుగులేద్దాం. ఓట్లు మనవైనపుడు, సీట్లు కూడా మనవే కదా
బహుజన హితాయః బహు జన సుఖాయః

జై బీసీ!
జై జై బీసీ #BCcasteCensusShouldBeConductedAcrossTheCountry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top