శ్రీశైలానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక.!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి ఏపీకి రానున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో పర్యటించనున్నారు. పీఎం టూర్‌కి సంబంధించిన డిటైల్స్‌ను శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి వెల్లడించారు. శ్రీశైలం వేదికగా జరిగే రాష్ట్రీయ జన జాగృతి ధర్మమ్ మహా సమ్మేళన్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారని శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధరామ పండితారాజ్య శివాచార్య మహాస్వామి తెలిపారు.
జనవరి 11నుంచి 15వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. భారీఎత్తున నిర్వహిస్తోన్న రాష్ట్రీయ ధర్మ జాగృతి మహా సమ్మేళన్‌లో దేశనలుమూలల నుంచి వెయ్యిమందికి పైగా పీఠాధిపతులు, మఠాధిపతులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని చెప్పారు. విశ్వ కల్యాణం కోసం కర్ణాటక బెల్గాం శ్రీక్షేత్రం నుంచి శ్రీశైలానికి చిన్న సిద్ధరామ పండితారాజ్య శివాచార్య మహాస్వామి మహా పాదయాత్ర చేస్తున్నారు. 40రోజులుగా సాగుతోన్న ఈ పాదయాత్ర మరో మూడ్రోజుల్లో శ్రీశైలం క్షేత్రానికి చేరుకోనుంది. అనంతరం, డిసెంబర్ 1నుంచి జనవరి 10వరకు పలు రకాల ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరిగా జనవరి 11నుంచి 15వరకు ఐదు రోజులపాటు విశేష కార్యక్రమాలు ఉంటాయని శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి వెల్లడించారు. ఈ ధార్మిక కార్యక్రమంలో లక్షలాదిమంది పాల్గొంటారని తెలిపారు.