APPSC సభ్యులుగా నియమించబడిన నా ఆప్తమిత్రుడు సిద్ధం శివరాం కు హృదయ పూర్వక అభినందనలు..
వ్యాసం ;- కాశీపురం ప్రభాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ & రచయిత
*లక్ష్యంపై గురిపెట్టాడు.. అనుకున్నది సాధించాడు*
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా మిత్రుడు సిద్ధం శివరాం బాధ్యతలు స్వీకరించాడు.
అతడిని ఈ పదవి వరించిన విధానం వెనుక నాలుగున్నర ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఉంది. రాజకీయంగా తీసుకున్న సమయోచిత నిర్ణయాలు ఉన్నాయి. ఎంచుకున్న లక్ష్యం కోసం అలుపెరుగని పోరాటం కూడా ఉంది.
2001 లో నేను ఈనాడు కంట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు బిళ్ళళాపురం అనే పల్లె లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది.. దాదాపు 40% ఊరు తగలబడి పోయింది.
నేను ఈ దుర్గటన కవరేజ్ కోసం ఫోటోగ్రాఫర్ నజీర్ ను తీసుకొని బిళ్ళలాపురం వెళ్ళాను. ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడు నాకు పరిచయం అయ్యాడు. నాతో పాటు ఊరంతా తిరిగి ప్రమాద బాదితులు, జరిగిన నష్టం తదితర వివరాలు అందించాడు. నంద్యాల చెరువుకట్టకు ఆనుకునే ఆ ఊరు ఉంటుంది. అయినా మంటలు ఆర్పేందుకు సరైన నీటి సరఫరా వ్యవస్థ లేదు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మంటల్లో తగలబడిన ఆ గ్రామం ఇప్పుడు అగ్ని కీలల్లో ఆహుతి కావడం నిజంగా బాధాకరం.
అతడు అందించిన సమాచారం ఆధారం చేసుకొని నేను
“మంటల్లో తల్లడిల్లిన బిళ్ళళాపురం” అనే స్పాట్ వార్త ఇచ్చాను.
ఆ మరునాడు..
“చెంతనే చెరువు.. అయినా గుండె చెరువు” అనే శీర్షికతో మానవీయ కోణంలో అగ్ని ప్రమాద బాధితుల కథనాలు ఇచ్చాను. దీంతో జిల్లా యంత్రాంగం దిగొచ్చి ఆ ఊరి ప్రాథమిక సమస్యలను పరిష్కరించింది.
….. ఆనాడు ఆ విధంగా పరిచయం అయిన యువకుడే ఈ సిద్ధం శివరాం. తిమ్మానాయుని పేటకు చెందిన బికారి సాహెబ్, వలి అనే మిత్రుల ద్వారా నాకు మరింత సన్నిహితుడు అయ్యాడు.
అప్పట్లో “రాయల్ యూత్” అనే సంస్థ నడిపేవాడు.
“లా ” పట్టభద్రుడైన శివరాం.. ప్రాక్టీస్ చేసింది తక్కువే. రాజకీయ ఆకాంక్షతో పూర్తి కాలం రాజకీయాల్లో కొనసాగాడు. డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం తో పూర్తి స్థాయి కాంగ్రెస్ కార్యకర్తగా మారాడు.
నంద్యాల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా చేశాడు. నాటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒక్కడయ్యాడు.
*2009 లో రాజకీయ మలుపు*
బలిజ సామాజిక వర్గానికి చెందిన శివరాం వ్యక్తిగతంగా సౌమ్యుడు కావడంతో అన్ని వర్గాల వారితో పరిచయాలు ఉన్నాయి. తన రాజకీయ కెరీర్ కు సంబందించిన ప్రతి విషయాన్ని శివరాం నాతో చర్చించేవాడు.
2009 లో నంద్యాల లోని అతడి సామాజిక వర్గం మొత్తం ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపుతోంది. అతని సామాజిక వర్గానికి చెందిన పేరుమోసిన నాయకులు దాదాపు ఆ పార్టీ లోకి వెళ్లిపోయారు. ఇతనిపై అన్ని రకాల ఒత్తిళ్లు వచ్చాయి.
నాతోనూ, వలీ తోనూ శివరాం చేసిన సమాలోచన వివరాలు ఇక్కడ అప్రస్తుతం.
అయితే, అతడు పార్టీ మారక పోవడం అనేది అతని భవిష్యత్ కు మంచి మలుపు అయింది. మంత్రి అయ్యాక శిల్పా మోహన్ రెడ్డి ఇతనికి నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇప్పించాడు. ఆ తర్వాత టీడీపీ హయాంలో కూడా ఇంకోసారి చైర్మన్ అయ్యాడు.
రెండు సార్లు యార్డ్ చైర్మన్ గా తనదైన శైలిలో అభివృద్ధి చేసాడు. రాష్ట్ర చైర్మన్ల సంఘం అధ్యక్షులుగా కూడా ఎంపికయ్యాడు.
2017 లో నంద్యాల బై ఎలక్షన్స్ సందర్బంగా వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలుపు కోసం పాటు పడ్డాడు. ఆ సందర్బంగా రాష్ట్రం లోని వైసీపీ నాయకులు అంతా నంద్యాలలో తిష్ట వేసిన సంగతి విదితమే. ఆ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా..అప్పుడు విస్తృతంగా పరిచయాలు పెంచుకున్నాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసాడు.
*నాలుగున్నరేళ్ళ ప్రయత్న ఫలితం*
2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. నాయకులు అందరూ నామీనేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మా ప్రాంతం నుంచి N MD నౌమాన్ అనే రాజకీయ వేత్త గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్మెంబర్ అయ్యాడు. శివరాం మనసులో కూడా అదే ఉన్నట్టుంది.
ఆ పదవికి నేనెందుకు నామినేట్ కాకూడదు అనుకున్నాడు.
అదే లక్ష్యం గా ఎంచుకుని ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
నా దగ్గరికి వచ్చి.. ” అన్నా.. నీ చేయి మంచిది.. నువ్వే దరఖాస్తును సిద్ధం చెయ్ ” అన్నాడు .
ఇద్దరం బాగా చర్చించి అతని బయోడేటా తో దరఖాస్తు సిద్ధం చేశాం. అలాగే ఎమ్మెల్యేలు, ఎం పి ల సిఫార్సు లేఖలు కూడా నాతోనే రాయించుకున్నాడు.
కేవలం సిఫార్సు లేఖలతో ఇంత పెద్ద పదవి రాదు. తన అర్హతలను, సామార్ధ్యాన్ని వివిధ దశల్లో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉంటుంది. చాలా సార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఈ మధ్య సర్వీస్ కమిషన్ సీనియర్ సభ్యుడు N. సుధాకర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. ఖాళీ అయిన ఈ పోస్ట్ కోసం ఎందరో ప్రయత్నాలు చేశారు.
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి తీవ్రంగా కృషి చేశాడు. ప్రభుత్వం అన్ని దరఖాస్తులను, సిఫార్సులను వడపోసిన అనంతరం సిద్ధం శివరాం అభ్యర్థిత్వాన్ని గవర్నర్ కు ప్రతిపాదన పంపింది.
ఎట్టకేలకు నాలుగున్నర ఏళ్ల అతని పోరాటం ఫలించింది.
అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.
మిత్రుడు శివరాం కు వచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పిస్తూ ఈ పదవీకే వన్నె తెస్తాడని ఆశిస్తున్నాను.