అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో మంగళవారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన
రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెలగపూడిలోని
రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
- ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2022 రద్దును ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం..
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2022 పై ప్రజలకు పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయన్న విషయం పలు పత్రికలు, ఇతర మీడియా సంస్థల ద్వారా
తేటతెల్లమైందని ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ తెలిపింది. దీంతో ఈ చట్టాన్ని రద్దు పర్చాలని భూయజమానుల నుండి తీవ్రస్థాయిలో ఒత్తిడి మొదలైంది.
ఈ చట్టాన్ని రద్దు పరచడానికి ఏపీ టైటిలింగ్ అథారిటీ ప్రస్తావించిన కారణాలు :
నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం టీఆర్ వో గా ప్రభుత్వ అధికారి ఉండాలి. కానీ ఆ స్థానంలో గత ప్రభుత్వం
ఎటువంటి అర్హత లేని వ్యక్తులను కూర్చోబెట్టేందుకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేసింది.
ఈ యాక్ట్ ప్రకారం సివిల్ కోర్టుల ప్రమేయం పూర్తిగా తుడిచివేయబడుతుంది. టీఆర్ వో దగ్గర సమస్య ఉత్పన్నమైతే నేరుగా వ్యయప్రయాసలకోర్చి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి.
టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు చేసే వారసత్వ ఆస్తుల బదలాయింపులు సివిల్ కోర్టుల ద్వారా చేయబడవు.
ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుత ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మరియు
న్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి.
ఈ చట్టం చాలా హడావిడిగా స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా చేయబడింది
ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన భూయజమానికి జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సదరు టీఆర్ వో వద్దే ఉంటాయి.
దీని వల్ల ప్రభుత్వం సదరు ఆస్తులను తనఖా పెట్టుకునే అవకాశం ఉందని భూయజమానులు భయాందోళనకు గురయ్యారు.
ఇది ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తుందని భూ యజమానులు సంఘ విద్రోహ శక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తుంది.
టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (టీఆర్ వో)లు జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ) లు భూయజమానులను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది.
ఎలాంటి శిక్షణ, అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారుల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరిన్ని అవరోధాలు, గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి.
టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, టైటిల్ అప్పిలేట్ అధికారులు స్థానిక రాజకీయ నాయకుల
ఒత్తిడికి తలొగ్గి వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ లు, మ్యూటేషన్ లు చేసే పరిస్థితి దాపురించే అవకాశం.
ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేబినెట్, ప్రజా ప్రతినిధులు మరియు మనందరిపైన ఉందని ముఖ్యమంత్రి సూచించారు.
మరింత మెరుగైన ఇసుక, గనుల పాలసీ
- ఇసుక, గనుల పాలసీ – 2019 మరియు మరింత మెరుగైన ఇసుక విధానం -2021లను రద్దుచేస్తూ ఉచిత ఇసుక మెకానిజం -2024 ఏర్పాటు అయ్యేంత వరకు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే మధ్యంతర వ్యవస్థ ఏర్పాటు చేసేలా తేదీ: 8.7.2024న జారీ చేసిన జీవో ఎం.ఎస్ నంబర్ 43 కు కేబినెట్ ఆమోదం..
ఇప్పటివరకు ఆయా సంస్థలతో ఉన్న ఒప్పందాలను నిలుపుదల చేయడం, ఇసుక కు సంబంధించిన స్టాక్ ను సంబంధిత అధికారులకు
అప్పగించాలని మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేస్తూ కేబినెట్ ఆమోదం
శాండ్, మైనింగ్ పాలసీ -2022 మరియు మరింత మెరుగైన ఇసుక పాలసీ -2021 లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదట వినియోగదారుల అభిప్రాయాలను
పరిగణలోకి తీసుకుంటూ పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం (కాంప్రహెన్సివ్ శాండ్ పాలసీ) – 2024 ను రూపొందించాల్సిన అవసరం ఉంది.
వినియోగదారులకు సరసమైన ధరలకు ఇసుక లభించేలా చూడటం, శాండ్ ఆపరేషన్ లో పారదర్శకతను పెంపొందించడం, ఇసుక అక్రమ తవ్వకాలు,
రవాణాను అరికట్టడం, పర్యావరణ హితం కోరుతూ గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్ జీటీ) ఇచ్చిన మార్గదర్శకాల
మేరకు సమగ్ర ఇసుక విధానం -2024 ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
- 2024-25 సంవత్సరానికిగానూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం రూ.2000 కోట్ల రుణాన్ని వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల సంస్థ పొందేలా అనుమతిస్తూ తేది: 28.6.2024 నాడు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ జారీ చేసిన జీవో ఎం.ఎస్ నంబర్ 6 లో రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం..
గత రబీ సీజన్ లో సేకరించిన వరి ధాన్యానికి 84 రోజులు గడిచినా ఎటువంటి సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేశారు.
ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బకాయి పడ్డ సొమ్ము రూ. 1000 కోట్లు సదరు రైతులకు చెల్లించింది.
రైతులకు కనీస మద్దతు ధర కల్పించే పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ఆహార, పప్పు ధాన్యాలను సేకరించి
జాతీయ ఆహార భద్రతా చట్టానికనుగుణంగా తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాయితీ ధరలకు అందిస్తున్న విషయం విదితమే.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యసేకరణకు రుణాలను తీసుకోవాల్సిన పరిస్థితి.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ
- 2024-25 సంవత్సరానికిగానూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ఏపీ మార్క్ ఫెడ్ కు ఎన్ సీ డీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) నుండి వర్కింగ్ కేపిటల్ అసిస్టెన్స్ రూపేణా రూ.3,200 కోట్ల కొత్తగా రుణాన్ని పొందేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ, సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం..
- Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్యం కొనుగోలు విధానంలోని లోపాలను సవరించి రైతులకు సులువైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న క్రాఫ్ ఇన్సూరెన్స్ చట్టాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఆర్థిక, పౌర సరఫరాలు,
వ్యవసాయ శాఖ మంత్రులు ముగ్గురితో కూడిన ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. నెలరోజుల్లో నివేదికను ఇవ్వాల్సిందిగా ఆ కమిటీకి సూచించారు.
కౌలు రైతులకు సులువుగా రుణాలు అందించే కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా కేబినెట్ కు ముఖ్యమంత్రి సూచించారు.
ఇతర అంశాలు :
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ అవార్డు వచ్చిందని,
ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్ తో సమానమని,ఈ అవార్డు క్రింద 9 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ ప్రకృతి సేద్యాన్ని 2018లో..
నాటి ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 5 లక్షల హెక్టార్లతో ప్రారంభమై 10 లక్షల మంది రైతులను భాగస్వామ్యులను చేయడం జరిగింది.
ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా చేస్తున్న ప్రకృతి సేద్యం ప్రస్తుతం 4 రెట్లు పెరిగి 2029 నాటికి
20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచి ఆదర్శ ప్రాయం అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ కి తెలియజేశారు.
……………………………………………..
జారీ చేసిన వారు: సంచాలకులు, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం