అడ్డసరం పొలం గట్లమీద దాదాపు నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహు వార్షిక పొద. సంస్కృతంలో ‘వాసా’గా వ్యవహరించే దీని శాస్త్రీయ నామం, అఢతోడ వాసిక, ఇది అకాంథేసి కుటుంబానికి చెందినది.ఈ మొక్కకు సామాన్య పత్రాలు కణుపుకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా, దీర్ఘ వృత్తాకారంగా, దళసరిగా, పెళుసుగా వుంటాయి. పండిన ఆకులు పసుపు పచ్చగా ఉంటాయి. దీనికి ఆకర్షణీయమైన తెల్లని పూలు గుత్తులుగా పూస్తాయి.దీని కొమ్మ నరికి పాతితే వేర్లు వచ్చి చిగుర్చి కొత్త మొక్కగా అభివృద్ధి. చెందుతుంది. దీని ఆకులు, పూలు, వేర్లు, ఔషధాల్లో విస్తృతంగా వాడతారు. ఎండిన అడ్డసరపు ఆకులు పచారి కొట్లలో దొరుకుతాయి. ఈ మొక్కలందు వాసికిన్, అఢతోడిక్ ఆసిడ్, సుగంధిత తైలం మొదలగు అంశాలుంటాయి. ఈ మొక్కపై విస్తృతంగా పరిశోధనలు జరిపి ఊపిరితిత్తుల్లోని శ్వాస మార్గాలను వ్యాకోచింపచేసే గుణమున్నట్లు కనుగొన్నారు.
బహురోగ నివారిణిగా ఇది ఎంతో ప్రాముఖ్యం పొందింది. ముఖ్యంగా: దగ్గు, ఆయాసాలలో ఇది అత్యంత ఉపయుక్తమైంది. దీర్ఘకాలం నుంచి ఉన్నదగ్గుల్లోను, కళ్లె తెగక ఊపిర అందక ఆయాసంతో బాధపడువారికి సమూల కషాయంలో కొద్దిగా పంచదార చేర్చి 15 మి.లీ. చొప్పున రోజుకి మూడు మార్లు సేవిస్తే శీఘ్ర ఉపశమనం కలుగుతుంది. ఎండిన అడ్డసరపు ఆకులను చుట్టగా చుట్టి పీల్చడం వల్ల సత్వరమే ఆయాసం ధృతి నెమ్మదిస్తుంది. ఆకుల కషాయమైతే నాలుగు స్పూన్లు, రసం అయితే రెండు స్పూన్ల చొప్పున రోజుకు మూడు మార్లు సేవిస్తే నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి. పచ్చి ఆకులు దొరకనపుడు కషాయం చేయాలంటే ఎండు ఆకుల్ని చూర్ణించి రెండు స్పూన్ల పౌడరును రెండు గ్లాసుల నీటిలో వేసి అరగ్లాసు నీరు మిగులునంతవరకు మరగించి దించి చల్లార్చి వడగట్టుకుంటే సరిపోతుంది.
గోరు వెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు మొదలగు చర్మవ్యాధులు తగ్గుతాయి. పసుపు, అడ్డసరపు ఆకుల చూర్ణం సమంగా కలిపి వుంచుకుని రెండు పూటలా పూటకు అరచెంచా చొప్పున మీగడతో తీసుకుంటే పొడి దగ్గులు తగ్గుతాయి. అడ్డసరపు ఆకుల్ని మెత్తగా నూరి పట్టీవేస్తే వ్రణాలు, పుండ్లు, కీళ్ళవాపులు, నొప్పులు తగ్గుతాయి. అడ్డసరపు ఆకుల రసానికి కొద్దిగా మిరియాల చూర్ణం కలిపి రోజు ఉదయం పూట మాత్రమే ఒక ఔన్సు చొప్పున తాగుతూ మజ్జిగ అన్నం మాత్రమే తింటుంటే కామెర్లు త్వరగా తగ్గుతాయి. ఈ మొక్క సమూల చూర్ణంగాని లేత ఆకుల చూర్ణం మాత్రమే గాని ఒక గ్రాము చొప్పున మూడు పూటలూ వెన్న లేక పంచదారతో సేవిస్తే స్త్రీలలో కలుగు ప్రదరవ్యాధులు తగ్గుతాయి. అడ్డసరం పూలను ఒక వెడల్పాటి గాజు పాత్రలో తీసుకుని వాటిపై రెట్టింపు పటిక బెల్లం పొడిని చిలకరించి ఎండలో ఉంచి ఉదయం, సాయంత్రం కలియబెట్టాలి.
జీర్ణశక్తి వృద్ధి
ఇలా కొన్ని రోజులు చేస్తే లేహ్యంగా తయారవుతుంది. దీన్ని రోజుకి రెండుమార్లు ఒక స్పూను చొప్పున సేవిస్తే శరీరంలో వేడి తగ్గుతుంది. క్షయవ్యాధిలో ఉండే మొండి దగ్గు, దగ్గితే రక్తం పడటం, ఎప్పుడూ వేడిగా ఉ న్నట్లుండటం, జ్వరం తరచుగా వస్తుండటం తగ్గి జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. సుఖనిద్ర కలుగుతోంది.
అడ్డసరం అతిమధురం శుంఠి, మిరియాలు, దాల్చిన చెక్క చూర్ణాలను ఒక్కొక్కటి యాభై గ్రాములు, సైంధవ లవణ చూర్ణం ఇరవై అయిదు గ్రాములు అందులో కలిపి దించి గోరువెచ్చగా వున్నపుడు తాగాలి. అవసరమైతే ఇందులో కొద్దిగా పటిక బెల్లం పొడి కూడా కలుపుకోవచ్చు. ఈ ఔషదాన్ని రోజు రెండు. సార్లు సేవిస్తే అధిక తుమ్ములు తగ్గిపోతాయి. అరచెంచా అడ్డసరం ఆకుపొడి చెంచా అల్లం రసంలో కలిపి రోజూ రెండు మూడు సార్లు తీసుకుంటుంటే కళ్ళె సమస్య తగ్గుతుంది.
ఎండించిన అడ్డసరపు ఆకులను కాల్చి బూడిద చేసి జల్లించి వుంచుకుని రోజూ తగినంత బూడిదను నువ్వుల నూనెతో కలిపి లేపనం చేస్తుంటే సొరియాసిస్ వ్యాది తగ్గుతుందని జానపద అనుభ వైద్యం చెబుతోంది. అడ్డసరం మొక్క నుపయోగించి వాసకారిష్ట, వాసావలేహ్యం, పంచతిక్త ఘృతం మొదలగు ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తారు. అట్లే దగ్గు, జలుబు ఇతర ఊపిరి తిత్తుల వ్యాధులకు వాడే చాలా ప్రఖ్యాతి గాంచిన యునాని ఔషధం సపూఫ్ ఇ సర్ఫా తయారీలో కూడా అడ్డసరపు ఆకులను ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము, ధూళి, సరపడని వస్తువులు, ఆహార పదార్థాలు, వాతావరణ కాలుష్యం మొదలగు కారణాల వల్ల శ్వాసనాళాలు సంకోచించి ఆయాసపడే వ్యాధి పీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలం వాడినా ఉపద్రవాలు కలుగని ఈ మొక్క పాత్ర ఎంతో శ్లాఘనీయమైనది. జంతువులపై జరిగిన పరిశోధనల్లో ఈ మొక్కలో గర్భస్రావం కలుగజేసే గుణమున్నట్లు గ్రహించారు. కావున గర్భవతులు దీన్ని వాడకుండా ఉండటం మంచిది.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV