నగ్నంగా నడివీధిలో గుర్రపు స్వారీ చేసిన రాణి
—————– …… కాశీపురం ప్రభాకర్ రెడ్డి
అవును.. ఇది నమ్మశక్యం కాని చారిత్రిక నిజం. అధికార మదంతో ప్రజల్ని వేధించిన రాణుల్ని చూసాం. విలాసాల కోసం అధిక పన్నులతో వేపుకు తిన్న రాజుల గురించి విన్నాం. అదే ప్రజల్ని కన్న బిడ్డల్లా పాలించిన ప్రభువుల గురించి కూడా చదివాం.
అయితే, ప్రజల నెత్తిన పన్నుల భారం తగ్గించాలంటూ నగ్నంగా నడి వీధికి వచ్చిన రాణి గురించి విన్నారా..?
ఆ రాణి పేరు లేడీ గోడివా. 11 వ శతాబ్దం లో ఇంగ్లాండ్ లోని మెర్సీయా ప్రాంత పాలకుడిగా ఉండిన లియోఫ్రిక్ భార్య ఈమె. క్రిస్టియన్ మిషనరీ లను ప్రోత్సాహిస్తూ స్థలాలు విరివిగా దానం చేసేది.
రాజధాని కోవెంట్రీ నగరం లో పన్నులు విపరీతంగా ఉండేవి. ప్రజలు ఈ అధిక పన్నులను చెల్లించలేక పోతున్నారనీ, సరళతరం చేస్తూ డిక్రీ ఇవ్వాలని భర్త లియోఫ్రిక్ ను కోరుతూ వచ్చింది. ఒక రోజు సభలో పన్నుల విషయమై గుచ్చి గుచ్చి అడిగి ఒత్తిడి చేసింది.
దీంతో ” నువ్వు నగ్నం గా నడి వీధిలోకి వస్తే నేను పన్నులు తగ్గిస్తూ డిక్రీ ఇస్తా ” అన్నాడు.
ఇందుకు ఆమె కూడా సరే అని ఒప్పుకుని ఒక షరతు విధించింది.
“బజారులో ఏ ఒక్కరినీ లేకుండా చేస్తే నేను గుర్రం పై నగ్నం గా సవారీ చేస్తా ” అంటూ.
ఇది సభ లో జరిగిన వాగ్వాదం కాబట్టి ఈ సవాల్ నుంచి ఆమె భర్త వెనకడుగు వేసే అవకాశం లేకుండా పోయింది.
ఆ రోజు రానే వచ్చింది. రాణి గోడివా తన ఒత్తయిన జుట్టుని ఆచ్చాదన చేసుకుని palace నుంచి నగ్నం గా బయటకు వచ్చింది. తన అశ్వాన్ని ఎక్కి మార్కెట్ వీధిలో తిరిగి భవనం చేరుకుంది. రాజ ప్రసాదానికి చెందిన ఇద్దరు మహిళలు మాత్రమే ఆమెను అనుసరించారు.
రాణి గారి నగ్న పర్యటన ముగిసింది.
ఇచ్చిన మాట మేరకు పన్నులు ఉపసంహరించ బడ్డాయి.
దీంతో లేడీ గోడివా పేరు ఇంగ్లాండ్ లో మార్మోగి పోయింది.
ఆ విధంగా ఆమె చరిత్ర కెక్కింది. ఆ కోవెంట్రీ లోనే కాదు.. ఇంగ్లాండ్ లో చాలా చోట్ల ఆమె శిలా విగ్రహాలు దర్శనం ఇస్తాయి.
*Peeping Tom అంటే ఎవరు..?*
లేడీ గోడివా కథ తోనే ముడిపడిన Peeping Tom గురించి కూడా తెలుసుకుందాం.
రాణి నగ్నంగా వీధిలోకి వచ్చే సమయం గురించి నగరం లో ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలనీ, ప్రతి ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
అయితే టామ్ అనే ఒక టైలర్ మాత్రం కొద్దిగా కిటికీ తెరిచి రాణి అందాలు చూసాడట. ఇది బయటకు పొక్కడం తో అతడిని బంధించి ఉరి తీశారట.
అప్పటి నుంచి ఈ విధంగా దొంగ చాటుగా వేడుక చూసే వారిని Peeping Tom అని పిలవడం పరిపాటి అయిపొయింది.
……. అన్నట్లు ఇంకో ముఖ్య విషయం ఏమంటే.. ఈ కోవెంట్రీ ప్రాంతం లో ప్రతి ఏటా జులై నెల లో 3 రోజులు పాటు ఆమె పేరిట” గోడివా ఫెస్టివల్ ” జరుగుతుంది. దీన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్ష కు పైగా వీక్షకులు వస్తారు.
….. ఈ కథ చదివి ఎవరికైనా మా కర్నూల్ మంగమ్మవ్వ గుర్తు వస్తే నా తప్పు కాదు.
…… కాశీపురం ప్రభాకర్ రెడ్డి also read