అన్నవరం సమీపంలో మన్యం పులి మరల సంచారం

The tiger is back on the move

The tiger is back on the move

  • కాకినాడ జిల్లా – అన్నవరం సమీపంలో మన్యం పులి మరల సంచారం

కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని శంఖవరం మండల పరిధిలో మన్యం పులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గత రెండు మూడు రోజులుగా శంఖవరం మండలం అచ్చంపేట – జి.కొత్తపల్లి గ్రామాల మధ్య ఈ పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. తాజాగా శంఖవరం గ్రామానికి సమీపంలోని ఊరుకొండ కొండ ప్రాంతంలో పులి తిష్ట వేసినట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత దృష్ట్యా అటవీ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు.

సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యానికి అధికారులు సూచించారు. అలాగే గ్రామస్తులు కూడా అవసరం లేకుండా అడవి ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లే కొండ మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అటవీ శాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక అధికారులు, ట్రాంక్విలైజర్ బృందం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పులి పట్టుబడే వరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు. రైతులు తమ పశువులను రాత్రి సమయంలో బయట వదిలిపెట్టకుండా సురక్షిత ప్రదేశాల్లో కట్టివేయాలని, గ్రామాల్లో రాత్రి వేళల్లో లైట్లు వెలిగేలా చూడాలని అధికారులు సూచించారు.

అలాగే ఎవరైనా పులిని గమనించినట్లయితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అధికారులు డ్రోన్లు, ట్రాప్ కెమెరాల సహాయంతో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. గమనిక: ఈ ప్రాంతంలో గతంలో కూడా అడవి జంతువుల సంచారం కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top