రాయలసీమ లిఫ్ట్‌ను ఆపించాను – CM రేవంత్ రెడ్డి

topped the Rayalaseema lift - CM RevanthReddy

topped the Rayalaseema lift - CM RevanthReddy

రచయిత.. వివేక్ లంకమల

చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్‌ను ఆపించాను’ అంటూ తేనెతుట్టె కదిపారు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రం కోసం తానెంత కష్టపడుతున్నది తెలంగాణ ప్రజలకు తెలియడానికి బయటపెట్టాడు తప్ప నిజానికది నీకిది నాకది అంటూ నాలుగ్గోడల మధ్య చాటుగా జరిగిన వ్యవహారం. వాస్తవం వాళ్లిద్దరికే తెలియాలి.ఈ మాట జనాల్లోకి వెళ్తే ‘నేను మారాను.. నేను మారాను…’ అని చెప్పుకుంటున్న చంద్రబాబు గారికి మళ్లీ ఎక్కడ ‘రాయలసీమ ద్రోహి’ అనే ముద్ర పడుతుందోనని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వెంటనే అలెర్ట్ అయ్యారు.

‘రాయలసీమ లిఫ్ట్‌ ఆగింది జగన్ హయాంలోనే. అయిదేళ్లలో దానికి పర్మిషన్లు తీసుకురాలేదు’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటలు జనాలకు చేరేలా వారి ఆస్థాన మీడియా, సోషల్ మీడియా యథా శక్తి పోరాడుతున్నారు. క్రిష్ణా వరద జలాలు రాయలసీమకు తీసుకుపోతామంటే ఇంతలా అభ్యంతరాలు చెప్తున్న తెలంగాణ పాలమూరు – రంగారెడ్డికి ఉన్నాయా? కల్వకుర్తి ఎత్తిపోతలకు ఉన్నాయా?

‘బంగారు తెలంగాణ’ అంటూ గోదావరి మీద అట్టహాసంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా అనుమతులు లేవు. ‘ప్రాణహిత – చేవెళ్ల’ డిజైన్లు మార్చిన ప్రాజెక్టు అది. అలానే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా లేవు. అయినా అనుమతులు లేవని ఆపింది రాయలసీమ లిఫ్ట్‌‌కి కాదు, పర్యావరణ అనుమతులు లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆగింది. ఆ కంప్లైంట్ ఇచ్చింది కూడా సదరు జాత్యోద్ధారక పార్టీ చిత్తూరు జిల్లా నాయకులు. ఆ తర్వాతనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం అందులో ఇంప్లీడ్ అయింది.

‘మేము కొత్త ప్రాజెక్టు కట్టట్లేదు, కొత్తగా భూ సేకరణ జరపడం లేదు, ఇక్కడ పర్యావరణానికి వచ్చే నష్టం లేదు, కేవలం కాలువల వెడల్పు మాత్రమే చేస్తున్నాం’ అని గత ప్రభుత్వ వాదన. తెలంగాణ అభ్యంతరాలు, కేఆర్ఎంబీ హెచ్చరికలు, మీడియా నెగెటివ్ ప్రచారం లెక్కచెయ్యకుండా మొండిగా చేసుకుంటూ వెళ్లారు. ఇంత తతంగం జరిగాక ఎన్‌జీ‌టీ స్టే విధించింది. అప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. వాస్తవాలు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించని ఆ పార్టీ సానుభూతిపరులు ‘నాయకుని చిత్తశుద్ధి ఉండాలి బాబు గారు పట్టిసీమ ఎత్తిపోతల పూర్తి చెయ్యలేదా?’ అంటారు.

నిజానికి పట్టిసీమ ఒక ప్రాజెక్టే కాదు. అప్పటికే సిద్ధంగా ఉన్న పోలవరం కుడికాలువకు హంద్రీ – నీవా లిఫ్ట్ మోటార్లు తెప్పించి, నదుల అనుసంధానం అంటూ జాతికి అంకితం చేశారు. పట్టిసీమలో బాబు గారు కొత్తగా చేసింది ఏమీ లేదు. అది పోలవరం కుడికాల్వలో అంతర్భాగం. రేవంత్ రెడ్డి మాటలు, చంద్రబాబు త్యాగాలు, ఆ పార్టీ నాయకుల మాటలు, మీడియా సన్నాయి నొక్కులు పక్కనపెడితే.. 2014 రాష్ట్ర విభజన తర్వాత కట్టిన ఏ ప్రాజెక్టుకు అనుమతులున్నాయి? చెప్పిందే చెప్పి తప్పును ఒప్పు చేసే అభూతకల్పనలు.. తాము నందంటే నంది, పందంటే పందిలా ప్రచారం చేసే మీడియా ప్రాపగాండా, వాటిని నమ్మి అవే అసలు సత్యాలని భ్రమపడే జనాలకు మనసు ఒప్పుకోదు కానీ, వైయస్సార్ మరణించిన తర్వాత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అనుమతులున్న / తెచ్చుకున్న / మొదలుపెట్టి, పూర్తయిన ఒక్కటంటే ఒక్క మధ్య / భారీ నీటి పారుదల ప్రాజెక్టు చూపించగలరా? దొరకవు. అంత చేసీ ఆయనేమైనా దశాబ్ధాల కాలాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అంటే కేవలం అయిదేళ్లు మాత్రమే ఉన్నాడు. పోలవరం దశాబ్ధాల కల అంటారు. అతడు నెరవేర్చాడు. ప్రాజెక్ట్ టైగర్, వైల్డ్ లైఫ్ శాంక్చుయరీల వంటి నల్లమల కాంప్లికేషన్స్ అన్నీ దాటి వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావడం అంత సులభం కాదు. అతడు తెచ్చి చూపించాడు. గాలేరు – నగరి, పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, ప్రాణహిత – చేవెళ్ల, పోతిరెడ్డిపాడు వెడల్పు ఇలా పనులన్నింటి మీదా కర్నాటక, మహారాష్ట్రలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా లెక్కచెయ్యకుండా పని చేసుకుంటూ పొయ్యాడు.

జలయజ్ఞం అని ఆయన పనులు చేస్తుంటే ధనయజ్ఞం అంటూ ఎక్కడికక్కడ విషం చిమ్మారు. అయినా ఆగలేదు. అందుకే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మెజార్టీ ఇరిగేషన్ వ్యవస్థ ఆయన అనుమతులు తెచ్చిన, మొదలుపెట్టిన, పూర్తిచేసిన పనుల మీదే నడుస్తోంది. ఒక ముఖ్యమంత్రికి కేంద్రంలో పలుకుబడి ఉండి, రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే అయిదేళ్లలో ఎంత అద్భుతం చెయ్యొచ్చో మాటల్లో చెప్పలేదు, చేతల్లో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను, నేను కనిపెట్టనిదేదీ లేదు అంటూ ఆయనకు ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకునే బాబు గారు.

ఇప్పుడు కేంద్ర అధికార పార్టీతో కూటిమి కట్టి, 2014 – 18 వరకూ కేంద్రంతో కలిసి ఉండి, మరి తొలి తొమ్మిదేళ్లు కేంద్రంలో చక్రాలు తిప్పిన ఆయన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతిసారీ కేంద్రం అధికార పార్టీలో భాగస్వామిగా ఉన్నారు. అయిదేళ్లలో ఒక వ్యక్తి అంత చెయ్యగలిగితే.. పదహారేళ్లుగా అధికారంలో ఉన్న వ్యక్తి ఇంకెంత చెయ్యగలిగి ఉండాలి? చేశాడా..? ఎందుకు చెయ్యలేదు..?

జీవో నెం 69 రిలీజ్ చేసి, శ్రీశైలం డ్యాం కనీస నీటి మట్టాన్ని 854 నుంచి 834 అడుగులకు తగ్గించలేదా? రాయలసీమ గొంతు నొక్కలేదా? అది వైయస్సార్ రద్దు చెయ్యబోతే దేవినేని ఉమామహేశ్వర రావు లాంటి వాళ్లను ఉసిగొల్పి, ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేయించి, ‘శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతే క్రిష్ణాలో పారేది నీళ్లు కాదు రక్తం అంటూ వీర లెవెల్‌లో డైలాగ్‌లు పలికించలేదా?’

నిన్న మొన్న ఎక్కడో అంతర్జాతీయ పత్రికలో ఆర్టికల్ కూడా వచ్చింది. నరేంద్ర మోడీ తర్వాత దేశానికి ప్రధానమంత్రి కాబోయే నాయకులు చంద్రబాబు గారు, ఆయన పుత్రరత్నం గారు అని. మరి దేశంలో అంత బలమైన నాయకుడు తలుచుకుంటే రాయలసీమ లిఫ్ట్‌కు పర్మిషన్లు తీసుకురావడం ఎంతసేపు..! చిటికెలో పని. కానీ ఆ చిటుకు ఎన్నాళ్లైనా పడదు. పడకపోగా గోదావరి – బనకచర్ల, గోదావరి – నల్లమల సాగర్, గోదావరి – సోమశిల అంటూ రాయలసీమను సస్యశ్యామలం మాత్రం చేస్తారు(వారి ఆస్థాన మీడియాలో).

రాయలసీమ కోసం ఇంత అద్భుతంగా పనిచేసిన / చేస్తున్న విజనరీ ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు జేజేలు కొట్టాలి కదా. రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రయోజనం లేదు’ అని లేటెస్ట్ స్టేట్మెంట్. అద్భుతం సార్.. అద్భుతం. రాయలసీమ పట్ల మీకు చాలా క్లారిటీ ఉంది. మా వాళ్లకు లేక మీకు రాజకీయ ఊడిగం చేస్తున్నారు. మీ మీ నాయకుల ప్రాభల్యం కోసం రాయలసీమ లిఫ్ట్‌కు అనుమతులు లేవని, అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆగిందని, గొంతు పెంచి ఈరోజు వాస్తవాన్ని తొక్కిపెట్టొచ్చు కానీ వాస్తవ చరిత్రను మార్చలేరు.

Read More https://www.facebook.com/share/p/17yXVZUFAU/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top