వై.ఎస్.ఆర్ కడప జిల్లా…
కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళ ను కేవలం 6 నిమిషాల్లో కాపాడిన బ్లూ కోల్ట్ పోలీసులు ..సెల్యూట్ చేస్తున్న జనం
తక్షణం స్పందించి కాపాడిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు
ఇద్దరు బ్లూ కోల్ట్ పోలీసుల సమయస్ఫూర్తి, వేగవంతమైన స్పందన ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్న ముగ్గురిని కాపాడగలిగింది. అనుమానాస్పదంగా ట్రాక్ వెంబడి వెళ్తున్న వారిని రైల్వే ట్రాక్ మన్ గుర్తించి వెంటనే డయల్ 112 కు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి కేవలం 6 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాలనుకున్న మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను సురక్షితంగా కుటుంబసభ్యుల చెంతకు చేర్చి అప్పగించి శభాష్.. పోలీస్ అని స్థానికుల మన్ననలు పొందారు. నిమిషం ఆలస్యమైనా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన ఓ రైలు క్రింద పడి ముగ్గురు విగత జీవులుగా మిగిలేవారు.
వివరాలు…కడప ఎర్రముక్కపల్లి సమీపంలో ఉంటున్న ఓ మహిళ కుటుంబ కలహాలతో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలను తీసుకుని భాకరాపేట రైల్వే గేట్ వద్ద నుండి రైల్ ట్రాక్ పై వెళ్తుండగా విధుల్లో ఉన్న ట్రాక్ మన్ కిషోర్ వెంటనే గుర్తించి 112 కు సమాచారం చేరవేశారు. సమీపంలో గస్తీ లో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది కానిస్టేబుళ్లు జి.రమాకాంత్ రెడ్డి (PC 2306), వి.శ్రీనివాసులు (PC 2582) రంగంలోకి దిగి ట్రాక్ పై వేగంగా వెళ్తున్న మహిళ, ఇద్దరు పిల్లలను సురక్షితం చేసారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కౌన్సిలింగ్ చేసి అప్పగించారు. పోలీస్ శాఖకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు:
వేగంగా స్పందించి ఘటన స్థలానికి చేరుకొని ముగ్గురిని కాపాడి సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించిన బ్లూ కోల్ట్ సిబ్బంది కానిస్టేబుళ్లు జి.రమాకాంత్ రెడ్డి (PC 2306), వి.శ్రీనివాసులు (PC 2582) ని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
బలవన్మరణం.. ఒక్క క్షణపాటులో తీసుకునే అత్యంత భయంకరమైన నిర్ణయం.. ఆవేశంతోపాటు ఎంతో ఉద్వేగంతో క్షణాల్లో ఇక జీవించలేనంటూ జీవితానికి స్వస్తి పలికే పొరపాటు నిర్ణయం.. క్షణికావేశంతో ప్రాణాలు తీసుకునే ఆ సమయంలో గనుక తాను తీసుకునే నిర్ణయం తప్పు.. నీకంటే సమస్యలతో సతమతమవుతున్న వారు ఎందరో కాలంతో పోరాడి ఎలా బ్రతుకుతున్నారో చూడు.. నీకొచ్చిన కష్టం ఏపాటిది.. అని అలోచించి ఆత్మస్థైర్యంతో జీవించాలి.
జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.