పత్రికా ప్రకటన
డ్రగ్స్ రహిత జిల్లా కొరకు కృషి చేద్దాం… యువతను కాపాడుకుందాం
➤ జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
డ్రగ్స్ సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయవచ్చు
➤ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల, జూన్, 26 :-
డ్రగ్స్ రహిత జిల్లా కొరకు పాటుపడి యువతను కాపాడుకునేలా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పిలుపునిచ్చారు.
గురువారం ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్పీజీ మైదానంలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….దేశంలో మాదకద్రవ్యాలు ఉండకూడదనే నేపథ్యంలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో స్థాయిలో మాదకద్రవ్యాలను నియంత్రించడానికి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కలిగిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కొరకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఏ వ్యక్తి అయినా చెడు అలవాట్లు, మాదకద్రవ్యాలకు బానిసైతే తన ఎదుగుదలకు తానే అడ్డుకట్టు వేసుకోవడంతో పాటు ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ బంధాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందన్నారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించడానికి ప్రతి పాఠశాలలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసైతే అతనిని వివరాలు బహిర్గతం చేయకుండా చికిత్స ఇవ్వడం జరుగుతుందన్నారు. భారతదేశ అభివృద్ధిలో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలన్నారు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు టైర్ పంక్చర్ పేస్ట్, కాఫ్ సిరప్ ద్వారా మత్తుకు చేరువవుతున్నారన్నారు. అదే విధంగా యువత ఫోన్స్, ట్యాబ్స్ కు అలవాటు పడి చెడు అలవాట్లుకు బానిసవుతున్నారన్నారు. పెద్దలు చెప్పిన మాటలు విని సమాజానికి ఉపయోపడే పనులు చేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయులు డ్రగ్స్ వ్యతిరేకంగా సూచనలు, వీడియోలు ప్రదర్శించాలన్నారు. అదే విధంగా నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ… మాదకద్రవ్యాలకు అలవాటుపడిన యువత వివిధ రకాల నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందన్నారు. గతంలో కూడా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా జిల్లాలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరి సహకారంతో 39 కేజీల గంజాయి సీజ్ చేయడంతో పాటు 53 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నారని తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనపరులకు ప్రభుత్వ ఆసుపత్రిలో రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టాలు చాలా కఠినతరంగా ఉంటాయని, డ్రగ్స్ బారిన పడకుండా చైతన్యం కలిగి ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.
అంతకుముందు రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి తనయుడు ఫయాజ్, ఎక్సైజ్ ఎస్పీ, జిల్లా వైద్యాధికారి, రీహాబిలిటేషన్ సెంటరు డాక్టర్లు పాల్గొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పలు సూచనలు చేశారు. అదే విధంగా విద్యార్థినిలు కూడా పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎస్పీజీ మైదానం నుండి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీని కలెక్టర్, ఎస్పీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పిజి మైదానం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్లి తిరిగి ఎస్పీజీ మైదానం చేరుకుంది. అక్కడే మానవహారాన్ని నిర్వహించి పాల్గొన్న అందరితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, ఐసిడిఎస్ పిడి లీలావతి, మున్సిపల్ కమీషనర్ శేషన్న, పోలీస్ శాఖ డిఎస్పీలు, ఎస్సైలు, వివిధ శాఖల అధికారులు, ఎన్సిసి, కళాశాల, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
——————–////——————-
డిఐపిఆర్ఓ, నంద్యాల